టీడీపీ ఎంపీలు ప్లేటు మార్చారు, బెట్టు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనం లోపల ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు దౌర్జన్యానికి పాల్పడి బలవంతంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో టీడీపీ కార్యాలయం ఐదవ నెంబర్ రూములో 1984 నుంచి ఉంది. ప్రధాని కార్యాలయానికేకాక కీలకమైన మంత్రుల కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఇది ఉంది. తెలుగుదేశం సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కూడా గది మారలేదు.
ఈ గదిని కైవసం చేసుకోవటానికి సంఖ్యాబలం చూపించి గతంలో డిఎంకె ప్రయత్నించి విరమించుకుంది. టీడీపీ ఏళ్ల తరబడిగా ఉంటున్న కార్యాలయాన్ని మరో ప్రాంతీయ పార్టీ బలవంతంగా ఆక్రమించుకోవటానికి చేసిన ప్రయత్నం పార్లమెంట్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకప్పుడు సాదాసీదా రాజకీయ పార్టీ కార్యాలయంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఒక కార్పొరేట్ కార్యాలయంగా రూపాంతరం చెందటంతో సంఖ్యాబలం ప్రాతిపదికపై ఈ గదికి కేటాయించాలని పలు పార్టీలు కోరుతున్నాయి.
సంఖ్యాబలం తగ్గినందున రూమును ఖాళీ చేయవలసిందిగా నోటీసులు జారీ అయ్యాయి. టీడీపీ కంటే ఎక్కువ మంది సభ్యులున్న టిఎంసికి ఈ గదిని లోకసభ సెక్రటేరియట్ ఈ నెల 6న కేటాయించింది. టీడీపీకి మూడవ అంతస్తులో రెండు రూములు కేటాయించారు. అంతలోనే మంగళవారం తెలుగుదేశం ఏంపీలెవ్వరూ లేని సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించి బయటున్న నేమ్‌ప్లేట్స్‌ను పీకేసి తమ పేర్లున్న బోర్డులు తగిలించారు.

టీడీపీ, టీఎంసీ
టీఎంసీ సభ్యులు లోపల టీడీపీ కార్యాలయంలోకి ప్రవేశించి కూర్చున్నారు. రూములో ఉన్న కార్యాలయ సిబ్బందిని ఈ రూము తమకు కేటాయించబడిందని చెప్పి ఖాళీ చేయవలసిందిగా ఆదేశించారు. ఈ సంఘటన జరిగే సమయానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడైన సుజనా చౌదరి నివాస గృహంలో విలేకరుల సమావేశం జరుగుతోంది.

టీడీపీ, టీఎంసీ
కార్యాలయ సిబ్బంది తృణమూల్ కాంగ్రేస్ ఎంపీల దౌర్జన్యకాండపై సమాచారం అందించటంతో టిడిపి ఎంపీలు హుటాహుటిన పార్లమెంట్‌కు చేరుకుని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పెట్టిన నేమ్‌ప్లేట్స్ తీసేసి తమ బోర్డులు తిరిగి పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల చర్యపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి టిఎంసి ఎంపీలపై ఫిర్యాదు చేశారు.

టీడీపీ, టీఎంసీ
లోకసభ సెక్రటరీ జనరల్ ఈ వ్యవహారంపై విచారణ చేసి ఒక నివేదికను అందచేస్తారని తెలిసింది. రెండు పార్టీల మధ్య ఈ గది వ్యవహారంలో తలెత్తిన సమస్యకు బుధవారం పరిష్కారం లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 1984లో 32 స్థానాలను గెలుచుకుని మొట్టమొదటి సారిగా లోకభలో అడుగుపెట్టినప్పడు లభించిన ఈ గదిని ఖాళీ చేసే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనాయకుడు సుజనా చౌదరి తెగేసి చెప్పారు.

టీడీపీ, టీఎంసీ
16వ లోకసభలో తెలుగుదేశం కంటే ఎక్కువ స్ధానాలున్న తమకు కేటాయించిన ఈ గదిలోనే తమ కార్యాలయం ఉంటుందని తృణమూల్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుబోధ్ బందోపాధ్యాయ సవాలు చేశారు. ఈ రూమును విడిచిపెట్టే ప్రసక్తి లేదని సుజన తెలియచేశారు.

ప్రణబ్ ముఖర్జీ
కాగా, ఈ వ్యవహారం పైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. ఎంపీలు డిగ్నీటీ మెయింటెయిన్ చేయాలని హితవు పలికారు. ఇలాంటి రగడ సరికాదని ప్రణబ్ అన్నారు. మనం ప్రజల చేత ఎన్నుకున్న ప్రతినిధులమని, ఇలాంటి వారు అందుకు తగినట్లుగా నడుచుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications