మారిన నేత: జగన్ వద్ద గొంతెత్తుతున్నారు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో ఓటమితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తమ అధినేత వైయస్ జగన్ ఎదుట నాయకులు గొంతు విప్పుతున్నారు. జగన్‌లో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. వారు చెప్పే మాటలను ఆయన శ్రద్ధగా వింటున్నట్లు చెబుతున్నారు. పార్టీలో ముఖ్య నేత లకు తప్ప ఇతరులకు కలిసే అవకాశం ఇవ్వని జగన్ వైఖరిలో మార్పు వచ్చిందనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తించారు. పార్టీ ఓటమి కారణంగానే జగన్‌లో మార్పు వచ్చిందని సంతోషిస్తున్నారు. సమీక్షా సమావేశాల్లో జగన్‌లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపించినట్లు చెబుతున్నారు.
'మీరు మారాలి... మి మ్మల్ని కలవాలంటేనే భయంగా ఉం టుంది, ఏదైనా చెప్పాలన్నా చెప్పలేని పరిస్థితి' అని అరకు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జగన్‌తో చెప్పినట్లు సమాచారం. రాజమండ్రి ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం అరకు, విజయనగరంలోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిని జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎన్నికల్లో పార్టీ ఓటమిపై జిల్లాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలలో జగన్మో హన్‌రెడ్డి చూపిస్తున్న ఆప్యాయత, పలకరింపులు ఆ పార్టీ నేతలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సమీక్షా సమావేశాల్లో తాను మారుతున్నట్లు జగన్ స్పష్టమైన సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇసు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీలోని కిందిస్థాయి నేతలను విస్మరించడంతో జనం నాడిని అధినేత పట్టుకోవడంలో విఫలమయ్యారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జనంలోకి పార్టీని సమర్థవంతంగా తీసుకెళ్లలేక ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని వారంటున్నారు. ప్రస్తుతం వచ్చిన మార్పు ఎన్నికలకు ముందే వచ్చివుంటే ఎంతో బాగుండేదని చెబుతున్నారు. పార్టీ అధినేతకు క్షేత్రస్థాయి నేతలకు ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ఆయన చూట్టు చేరిన ముఖ్యనేతల కోటరి దయాదాక్షణ్యాలపై అధినేత దర్శనం లభించే పరిస్థితులు ఉండటంతో పార్టీకి ఉన్న ప్రధాన లోపమని భావిస్తున్నారు.
పార్టీ అధినేత తీరు మారడంతో సంతోషం వ్యక్తంచేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ పదవుల్లో ఇప్పటికైనా సమర్థవంతులకు, పార్టీని నమ్మినవారికి స్థానం కల్పించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications