బాబు ఇలాకాలో జగన్ పాగా వేశారా? (ఫొటోలు)
హైదరాబాద్: వైయ్ససార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో ప్రథమ శత్రువు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనే విషయం వేరే చెప్పాల్సిన పని లేదు. ప్రతి విషయంలోనూ ఆయన చంద్రబాబునే లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఆయన కార్యాచరణ కూడా ఉంటోంది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో పాగా వేయాలనేది వైయస్ జగన్ చాలా రోజులనాటి వ్యూహం. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఆయన భావిస్తున్నారు.
చివరకు ఆయన చంద్రబాబు కోటలో ప్రవేశించారు. వైయస్ జగన్ కుప్పం పర్యటనను అడ్డుకోవాలని చంద్రబాబు అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ కుప్పం పర్యటన సందర్భంగా దానివల్ల కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన పర్యటనకు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జగన్ కార్యక్రమాలు సజావుగా సాగిపోయాయి.
కుప్పంలో శనివారంనాడు ఆయన చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి మరణించినవారి కుటుంబాలను ఓదార్చారు. సమైక్య శంఖారావం సభ నిర్వహించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి చంద్రబాబు సహకరిస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబును రాష్ట్ర విభజనపై నిలదీయాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లాలో జగన్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని, తాను మాత్రమే సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నానని ప్రకటించుకోవడానికే అన్నట్లు వైయస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన సాగింది

సమైక్యంగా ఉంచి, తెలంగాణ పేరు..
రాయల తెలంగాణ ప్రతిపాదనను వైయస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లా సమైక్య శంఖారావం యాత్రలో వ్యతిరేకించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ పేరు పెట్టాలని ఆయన సూచించారు.

చంద్రబాబు కోటాలో ఓదార్పు..
వైయస్ జగన్ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఓదార్పు యాత్ర చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతి సందర్భంగా మరణించిన వెంకటేష్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

కుప్పం సమైక్య శంఖారావం సభలో..
కుప్పం సమైక్య శంఖారావం సభలో చంద్రబాబు నాయుడిపై జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విభజనకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా..
జగన్ సమైక్య శంఖారావం సభ ఎన్టీఆర్ సర్కిల్‌లో జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా జగన్ చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ జనం చంద్రబాబును కాదంటారా..
కుప్పం ప్రజలు తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నాయకుడిగా తొమ్మిదేళ్లకు పైగా కొనసాగుతున్న చంద్రబాబును కాదని జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఆదరిస్తారా అనేది ప్రశ్న.

కుప్పం ప్రజలకు దండాలు..
చంద్రబాబు ఇలాకాలోని ప్రజలకు వైయస్ జగన్ చేతులెత్తి దండం పెట్టారు. చంద్రబాబును సొంత నియోజకవర్గంలో దెబ్బ తీయాలనే జగన్ ఎత్తులు ఏ మేరకు పారుతాయో చూడాలి.
చిత్తూరు జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా జగన్ విమర్శలు చేశారు. చంద్రుడిలో మచ్చలా ఎంతో ఘనత గల చిత్తూరు జిల్లాకు చంద్రబాబు, కిరణ్ రెడ్డి మచ్చల్లా ఉన్నారని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ బహిరంగ సభకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చారు.
అయితే, కుప్పం పర్యటన ద్వారా చంద్రబాబును దెబ్బ కొట్టాలనే జగన్ వ్యూహం ఫలించినట్లేనా అనేది ప్రశ్న. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు అంత బలహీనంగా ఉన్నారా అనేది కూడా ప్రశ్నే. కొంత మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్ పర్యటన సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మొత్తం మీద, కుప్పం పర్యటన ద్వారా జగన్ హల్‌చల్ మాత్రం సృష్టించారు.
జగన్ పర్యటనపై చంద్రబాబు గానీ తెలుగుదే్శం పార్టీ నాయకులు ఏ విధమైన ప్రకటనలూ చేయలేదు. స్థానికంగా ఏ విధంగా ప్రతిస్పందించారో గానీ రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రం మాట్లాడడం లేదు. మౌనంగా ఉండడం ద్వారా విస్మరించే వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తారని అనుకోవచ్చు.
కాగా, చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావత్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications