బీజేపీ సీఎం అభ్యర్థి రజినీకాంత్!: తేల్చేసిన కేంద్రమంత్రి పోన్
రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని, బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు.
చెన్నై: తమిళనాడులో ఇప్పుడంతా సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. సొంత పార్టీ పెడతారా? లేక ఏదైనా పార్టీతో కలిసి ముందుకెళతారా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే, తాజాగా కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి.

బీజేపీలోకి వస్తే ఆనందం
రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని, బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. బుధవారం కరూర్‌లో మంత్రి రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ సందిగ్ధత ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు.

బీజేపీ సీఎం అభ్యర్థి రజినీ!
రజనీకాంత్ ప్రముఖ నాయకుడని, విశేష ప్రజాదరణ ఉందని కేంద్రమంత్రి అన్నారు. బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో అనుమానమేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే అంతిమంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీజేపీలోకి వస్తే రజినీకి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

రజినీని అడ్డుకుంటున్నారు..
రాష్ట్రంలో రైతుల ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కేంద్రం ఇప్పటికే రూ.1,200 కోట్లు కరవు సహాయ నిధులను విడుదల చేసిందని చెప్పారు. అయినా రైతు సంఘాల నాయకుడు అయ్యాకన్ను వివిధ పార్టీలకు వత్తాసు పలుకుతూ కేంద్రాన్ని నిందిస్తున్నారని ధ్వజమెత్తారు. రజనీకాంత్ బీజేపీలో చేరకూడదని వీసీకే నేత తిరుమావళన్ కులరాజకీయాలను రెచ్చగొడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు బీజేపీలో ఉన్నారని మంత్రి గుర్తు చేశారు.

పళని వర్గంలో చీలికల అవకాశంపై చర్చ
ఇది ఇలా ఉండగా, తమిళనాడులో అధికార అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలో మరికొన్ని చీలికలు వచ్చేలా సంభవిస్తున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం వ్యూహం రచిస్తోంది. పళనిస్వామి ప్రభుత్వ మనుగడపై ఆ పార్టీలో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణుల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా ఎలా మలచుకోవాలనే విషయమై బుధవారం చెన్నై అడయారు గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్ సెల్వం నివాసంలో జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా, ప్రధాని మోడీని సీఎం పళనిస్వామి కలవడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అయ్యింది. పళని.. కేంద్ర సాయం తీసుకుంటున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications