బాబుతో భేటీ: జగన్ పార్టీకి జంపింగ్ షాక్?
కర్నూలు: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మరోసారి జంప్ జిలానీల సమస్య తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్య వేడుకుల్లో పాల్గొనడానికి కర్నూలు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పలువురు వైయస్సార్ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు కలవడం ఆ చర్చనీయాంశంగా మారింది.
వైయస్సార్ కాగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక, మరికొందరు ఎమ్మెల్యేలు ఆయనను కలిసేందుకు వచ్చారు. దీంతో వారు టిడిపిలో చేరుతారేమోననే ఆందోళన వైయస్సార్ కాంగ్రెసును ఊపేసింది. ఎంపీ బుట్టా రేణుకతోపాటు కర్నూలు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీి ఎమ్మెల్యేలు సాయి ప్రసాద రెడ్డి, బాలనాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, గౌరు చరిత, మణిగాంధీలు టీడీపీలు చేరే అవకాశాలున్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి.

వీరిలో బుట్టా రేణుక భర్త నీలకంఠం ఇప్పటికే టిడిపిలో చేరారు. కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు వినతిపత్రం అందించేందుకు కలిసి రావాలంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆహ్వానం పంపించారు. ఆయన పిలుపునకు గౌరు చరిత, మణిగాంధీ మాత్రమే స్పందించారు. దీంతో బుట్టారేణుక, మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు బస చేసిన గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు.
వీరంతా చంద్రబాబును కలిసేందుకు నిరీక్షిస్తుండగాబుట్టా రేణుకకు మాత్రమే పిలుపు వచ్చింది. దీంతో, రేణుక భర్తతో సహా వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎస్వీమోహన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలే చేరడంపై ఒక్కసారిగా ఊహాగానాలు వెలువడ్డాయి.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు ఎమ్మెల్యేల చేరికకు టిడిపి స్థానిక నేతలు విముఖంగా ఉండడంతో వారి చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications