నా హత్యకు ప్లాన్, అందుకే దాడి: కేటీఆర్, సీపీపై ధర్మపురి అరవింద్ ఫైర్, కేసీఆర్‌పై విజయశాంతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా పర్యటనలో తనపై జరిగిన దాడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మంత్రి కేటీఆర్ డైరెక్షన్‌లో.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ సీపీ పర్యవేక్షణలోనే తనపై దాడి జరిగిందని ఆరోపించారు.

సీపీ పట్టించుకోలేదు.. ఆయుధాలతో వచ్చారు: ధర్మపురి అరవింద్
సోమవారం సాయంత్రమే సీపీకి ఫోన్ చేసి దాడి జరిగే అవకాశముందని చెప్పినా.. భద్రత కల్పించలేదన్నారు ధర్మపురి అరవింద్. తన ప్రాణం తియ్యడానికి పోలీసులు ప్లాన్ చేశారని ఆరోపించారు. కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు. దాడి జరిగిన ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నుంచి 25 మంది ఆయుధాలతో నిజామాబాద్ వచ్చారని ఆరోపించారు ధర్మపురి అరవింద్. తన ప్రాణం కాపాడినందుకు తన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు అరవింద్.

నాపై దాడికి పాల్పడింది వారిద్దరే: ధర్మపురి అరవింద్
పోలీస్ కమిషనర్ నియామకం అయినప్పటి నుంచి కలిసేందుకు ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. పసుపు రైతుల పేరుమీద అడ్డుకునే కుట్ర చేశారన్నారు. నిన్నటి ఘర్షణకు తమకు సంబంధం లేదని పసుపురైతు ఐక్య వేదిక ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. దాడికి పాల్పడింది రాము, మ్యూనిరుద్దీన్ అని చెప్పారు అరవింద్. ముస్లిం ప్రజలు పసుపు ఎప్పటినుంచి పండిస్తున్నారో తనకైతే సమాచారం లేదని.. దాడి జరిగిన స్థలంలో టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉన్నారని తెలిపారు అరవింద్. ఆర్ముర్ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నాడని ధర్మపురి అరవింద్ ఆరోపించారు. తమపై దాడి జరుగుతుందని పోలీస్ కమిషనర్‌కు తాము ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అర్వింద్.

రాజకీయంగా ఎదుర్కోలేకే టీఆర్ఎస్ దాడులు: విజయశాంతి
మరోవైజు, ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో బీజేపిని రాజకీయంగా ఎదుర్కొలేకే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, అది చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ సర్కారు బీజేపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి అందుకు నిదర్శనమన్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని పలు గ్రామాల్లో ఎంపీ ఫండ్స్‌తో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి అరవింద్ వెళ్తే టీఆర్ఎస్ గుండాలు దారిలో అడ్డుకుని దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అన్నారు విజయశాంతి.

ఎంపీ అరవింద్ వాహనంపై రాళ్లు, కత్తులతో దాడి: విజయశాంతి ఫైర్
ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై రాళ్లు, కత్తులతో దాడి చేసి రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని కేసీఆర్ మరోసారి రుజువు చేశారని విజయశాంతి విమర్శించారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అనే సందేహం కలుగుతోందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. ఒక పార్లమెంట్ సభ్యుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. చట్టం మీద నమ్మకంతోనే తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని.. లేకుంటే టీఆర్ఎస్ దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications