సీఎం విజయ్ మార్క్ ట్రీట్మెంట్: ఏఐఏడీఎంకేలో బిగ్ వికెట్ డౌన్: టీవీకే తీర్థం?
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కొక్కరూ పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ మంత్రి వైగై సెల్వన్ అన్నాడీఎంకేకు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకున్న అన్ని రకాల అధికారిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రెండు పేజీల లేఖను పంపించారు.
ఈ సందర్భంగా పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వ వైఖరిపై వైగై సెల్వన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో నిర్లక్ష్యం, అవమానం అనేవి మరణం కంటే ఘోరమైనవి.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని, కష్టపడే కార్యకర్తలను నాశనం చేసే వ్యక్తి ఎప్పటికీ మంచి నాయకుడు కాలేరని ఈపీఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు. డీఎంకే వ్యతిరేక సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, అధికార పార్టీతో రాజీ పడటం వల్లే అన్నాడీఎంకే తన సొంత అస్థిత్వాన్ని, గుర్తింపును పూర్తిగా కోల్పోయిందని ఆరోపించారు.

విద్యార్థి దశ నుంచి అన్నాడీఎంకే పార్టీ కోసం నిరంతరం శ్రమించిన తనకు.. చివరికి అవమానాలే మిగిలాయని వైగై సెల్వన్ వాపోయారు. తనను గౌరవించని చోట బతకడం కంటే ఆత్మగౌరవంతో తప్పుకోవడమే ఉత్తమమని తిరువళ్ళువర్ రాసిన తిరుక్కురళ్ సూత్రాన్ని ఆయన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార బాధ్యతల్లో తనను ఒంటరిని చేసినప్పటికీ పార్టీ విజయం కోసం తీవ్రంగా శ్రమించానని, అయినప్పటికీ అగ్రనాయకత్వం నుంచి తనకు తగిన గుర్తింపు లభించలేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఆయన అధికార టీవీకేలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీవీకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నాడీఎంకే నుంచి వలసల జోరు పెరిగింది. ఇప్పటికే ఈపీఎస్ మంత్రివర్గంలో పనిచేసిన ఎనిమిది మంది మాజీ మంత్రులు అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరిపోయారు. ఇటీవల మాజీ మంత్రులు విజయ్‌భాస్కర్, ఎంఆర్ విజయ్‌భాస్కర్, ఎంఎస్ఎం ఆనందన్, వలర్మతి వంటి ప్రముఖ నేతలు కూడా ఇదే బాట పట్టడం ఏఐఏడీఎంకే క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పుడు తాజాగా వైగై సెల్వన్ కూడా రాజీనామా చేయడం, పళనిస్వామిపై విమర్శలు చేస్తూ పార్టీని వీడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చేరికలపై మంత్రి ఆధవ్ అర్జున ఇదివరకే స్పందించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే సీనియర్ నేతలకు తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. ఒక మొక్కను వేరే చోట నాటడానికి పీకేసినప్పుడు దానికి పాత మట్టి అంటుకుని ఉన్నట్లే, తన జ్ఞాపకాలు కూడా పార్టీతో ముడిపడి ఉన్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications