పెట్రోల్, డీజిల్ సరఫరా కష్లాల వేళ బిగ్ రిలీఫ్ - ప్రభుత్వం కీలక ఆదేశాలు ..!!
రాష్ట్రంలో ఇంధన కష్టాలు కొనసాగుతున్నాయి. అయితే, గత రెండు రోజుల కంటే పరిస్థితి కొంత మెరుగు పడింది. ఆయల్ కంపెనీలు... పెట్రోల బంకుల మధ్య చోటు చేసుకున్న వ్యవహారాలు సామాన్యులకు కష్టాలు తెచ్చి పెట్టాయి. సరఫరాలో రేషనింగ్ వ్యవహారం ఈ పరిస్థితికి కారణంగా మారిందని చెబుతున్నారు. డీజిల్ కొరత కనిపిస్తున్నా... పెట్రోల్ సరఫరాలో ఇబ్బందులు తగ్గాయి. సీఎం చంద్రబాబు మరోసారి పరిస్థితి సమీక్షించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఏపీలో నెలకొన్న ఇంధన సంక్షోభం కొనసాగుతోంది. ఈ రోజు పరిస్థితి కాస్తమెరుగు పడింది. రానున్న రెండు రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా బంకుల్లో 'నో స్టాకు' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధన సరఫరా లేక మూత బడిన పెట్రోల్ బంకుల సంఖ్య సోమవారానికి 432కు చేరిందని అధికారులు తెలిపారు. ఇక తెరిచి ఉన్న పెట్రోలు బంకుల దగ్గర పెట్రోలు, డీజిల్ కోసం వచ్చిన వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. మండుటెండలో గంటల తరబడి నిలబడ్డారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు రేషన్ పద్ధతిలో చమురు విక్రయించాలన్న సర్కారు ఆదేశాల మేరకు బంకుల్లో.. ద్విచక్ర వాహనాలకు గరిష్ఠంగా రూ.200, ఆటోలకు రూ.500, కార్లు, జీపులకు రూ.1000, లారీలు, బస్సులు తదితర భారీ వాహనాలకు రూ.2 వేల విలువైన ఇంధనాన్ని మాత్రమే విక్రయించారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు సర్దిచెప్పిన పరిస్థితి కనిపించింది.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
కాగా, పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్రోలియం కంపెనీల నుంచి బంకులకు లోడ్ డిస్పాచెస్ ఎలా జరుగుతున్నాయని సీఎం ఆరా తీసారు. కాగా,
రాత్రంతా లోడ్ డిస్పాచెస్ జరిగాయని... నిరంతరం బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరిగేలా చూస్తున్నామని అధికారులు వివరించారు. ఇవాళ ఉదయం ఆరు గంటల సమయానికి 1402 లోడ్లు డిస్పాచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు. గత అర్థరాత్రి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు 2173 కిలో లీటర్ల పెట్రోల్, 2846 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని లెక్కలతో వివరించారు. స్టాక్ లేని బంకుల సంఖ్య ఎంత మేర ఉందని ముఖ్యమంత్రి అడగటంతో నిన్నటితో పోల్చుకుంటే గణనీయంగా తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు ఉదయం 6 గంటల నాటికి 432 బంకులు మినహా అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభ్యత ఉందని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరేంత వరకు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలని సీఎం ఆదేశించారు. క్యూలైన్లు లేకుండా చూడాలన్న సీఎం.. అవసరమైతే టోకెన్, స్లాట్ సిస్టంలను అవలంభించాలని ముఖ్యమంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications