పొదుపు వేళ.. యోగి బిగ్ స్టెప్: నొయిడా ఖాళీ?- వెహికల్స్ సరెండర్
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ తో పాటు చివరికి వంటనూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు.
దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఇతర వీఐపీ వాహన కాన్వాయ్‌లను 50 శాతం తగ్గించాలని ఆయన ఆదేశించారు. దేశవ్యాప్తంగా తలెత్తుతున్న ఇంధన కొరత, సరఫరా అంతరాయాల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన పొదుపు విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ దిశగా తాజా ఆదేశాలను ఇచ్చారు.

పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా ఇంధనం ఆదా, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం గురించి ప్రధాని మోదీ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్‌లో ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా అధికారిక వాహనాల వినియోగాన్ని, భద్రతా సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. పొదుపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఉత్తర ప్రదేశ్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోన్న అన్ని కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే వెసలుబాటును కల్పించాల్సి ఉంటుంది. దీని ప్రభావం గ్రేటర్ నొయిడాపై పడొచ్చు. ఇక్కడి ఐటీ హబ్ మొత్తం కూడా బోసి పోవచ్చు. దీంతో పాటు పీఎన్‌జీ, మెట్రో సేవలు, ప్రభుత్వ రవాణా వ్యవస్థల వినియోగానికి ఆయన ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు యోగి ఆదిత్యనాథ్. సదస్సులు, ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు వంటి కార్యక్రమాలను కూడా వర్చువల్‌గా నిర్వహించాలని సూచించారు.
ప్రధానమంత్రి పొదుపు పిలుపునకు స్పందిస్తూ, ఇంధన వినియోగాన్ని తగ్గించి, అనవసరమైన బంగారం కొనుగోళ్లను నివారించాలని నివాసితులకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఈ చర్యలన్నింటినీ ఆచరణలోకి తీసుకురావడంపై అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సీఎం సమావేశం అయ్యారు. ప్రణాళికను రూపొందించారు.
ఉత్తరప్రదేశ్ జల్ శక్తి మాజీ సహాయ మంత్రి దినేష్ ఖటిక్ మంగళవారం తన ఎస్కార్ట్ వాహనాలను తిరిగి ఇచ్చారు. జిల్లా పర్యటనలకు మోటార్‌సైకిల్‌ను ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. జిల్లా వెలుపల అధికారిక పనుల కోసం రైలులో ప్రయాణించడానికి ప్రాధాన్యత ఇస్తానని ఖటిక్ పేర్కొన్నారు. తన నివాసం వద్ద కూడా ఒకే ఒక గన్‌మ్యాన్‌ను మాత్రమే ఉంచుకుంటానని తెలిపారు. లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఈ పొదుపు చర్యలు అమలులోకి వచ్చాయి.
లక్నో మేయర్ సుష్మా ఖార్క్‌వాల్ తనకు కేటాయించిన రెండు ప్రభుత్వ వాహనాల్లో ఒకదాన్ని తిరిగి ఇచ్చారు. అధికారులు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, రోజు మధ్యలో ఇంటికి వెళ్లకుండా ఇంట్లో నుంచే భోజనం తీసుకురావాలని ఆమె సూచించారు.












Click it and Unblock the Notifications