'భోగాపురం' నుంచి విమానాల రాకపోకల షెడ్యూల్- ఏ నగరానికి ఎప్పుడు..!!
భోగాపురం విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 16న అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం పాత విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలు నిలిచిపోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 17 నుంచి అన్ని సర్వీసులు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మారనున్నాయి. ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల రాకపోకల షెడ్యూల్ ను ప్రకటించాయి. దీంతో పాటుగా ప్రయాణీకులకు కీలక సూచనలు చేస్తున్నాయి.
సుమారు రూ. 5,641 కోట్ల అంచనా వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన భోగాపురం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు షెడ్యూల్ ప్రకటించాయి. తొలి రోజు ఏకంగా 31 సర్వీసులను నడిపేందుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాలకు ఈ విమానాలు నడవనున్నాయి. దీంతో.. 16వ తేదీ అర్ధరాత్రి నుంచి విశాఖ విమానా శ్రయం నుంచి విమాన సర్వీసులు రద్దు అవుతాయి. విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్న అన్ని సర్వీసులు ఇక భోగాపురం కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. భోగాపురం నుంచి కమర్షియల్ సర్వీసులో తొలి విమానం సింగపూర్ కు వెళ్లనుంది. ఆగస్టు 16న రాత్రి 11:05 గంటలకు స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం భోగాపురం లో ల్యాండ్ అవుతుంది. ఈ విమానం గంట తర్వాత 12:05 గంటలకు సింగపూర్ బయలుదేరుతుంది.

విమానాల రాకపోకల వేళలు
కాగా, 17వ తేదీన ఇండిగో 31 సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. భోగాపురం నుంచి ఆరోజు హైదరాబాద్ కు ఉదయం 8:55, 10:40, మధ్యాహ్నం ఒంటిగంట, సాయంత్రం 4:25, రాత్రి 7:20, 8:40, 9 20 గంటలకు విమానాలు బయలుదేరనున్నాయి. అదే విధంగా భోగాపురం నుంచి ఢిల్లీకి ఉదయం 8:20, రాత్రి 10:45... బెంగళూరుకు మధ్యాహ్నం 2:55, రాత్రి 9:10, చెన్నైకి మధ్యాహ్నం 12:15, సాయంత్రం 6:35.. కోల్ కతాకు రాత్రి 7:50, ముంబైకి మధ్యాహ్నం 3:05, తిరుపతికి మధ్యాహ్నం 1:50 గంటలకు విమానాలు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. ఏయిర్ ఇండియా సైతం హైదరాబాదు నుంచి భోగాపురం మధ్య రోజుకు ఐదు సర్వీసులు.. బెంగళూరు నుంచి భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు నడపనుంది. ఆది, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజులు మరో సర్వీస్ అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి భోగాపురం మధ్య రోజుకు నాలుగు సర్వీసులు నడవనున్నాయి.













Click it and Unblock the Notifications