వైసీపీ వర్సస్ బీఆర్ఎస్: మంత్రుల డైలాగ్ వార్ - టార్గెట్ ఫిక్స్...!!
తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయం మొదలైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం..ఇదే సమయంలో తెలంగాణ వర్సస్ ఆంధ్ర మంత్రుల డైలాగ్ వార్ కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు వైపులా డైలాగుల్లో చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ - ఏపీ మంత్రుల మధ్య అసలు ఈ డైలాగ్ వార్ ఇప్పుడు ఎందుకు మొదలైందనే చర్చ వినిపిస్తోంది. రాజకీయంగా పై చేయి సాధించేందుకు రెండు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది.
ఏపీ వర్సస్ తెలంగాణ మంత్రులు..:ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అన్ని పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించటంతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ అధికారులతో సింగరేణి అధికారులు సమావేశం నిర్వహించారు. బిడ్ దాఖులకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఉంది. ఇదే సమయంలో బిడ్ కు సంబంధించి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏపీ మంత్రి అమర్నాధ్ తాము ప్రయివేటీకరణకు వ్యతిరేకమని స్పష్టం చేసారు. ప్లాంట్ బిడ్ లో పాల్గొనటం ద్వారా ప్రయివేటీకరణకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి హరీష్ ఏపీ పైన చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా డైలాగ్ వార్ మొదలైంది.

ఏపీ హోదా - స్టీల్ ప్లాంట్ పై కామెంట్స్:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని, తెలంగాణలో పొందాలని, ఆంధ్ర, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుందో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యల తో ఒక్క సారిగా రాజకీయంగా వాతావరణం హీటెక్కింది. దీనిని ఏపీ మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో, హరీష్ మరింతగా తన మాటలకు పదును పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వకున్నా.. అక్కడి అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు.. అని ఎద్దేవా చేశారు. ఇంకా జోక్ ఏందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. ఆనాడు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్న పరిస్థితి మీ రాష్ట్రంలో ఉందంటూ పరోక్షంగా చంద్రబాబును టార్గెట్ చేసారు. ఈ రోజు ప్రజలను గాలికి వదిలేశారు. అధికార, ప్రతిపక్షాలు.. స్వార్థం కోసం పనిచేస్తున్నాయి. మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది అంటూ వ్యాఖ్యానించారు.
టీడీపీ టార్గెట్ -సెటిలర్స్ ఓట్లపై గురి:హరీష్ వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. సచివాలయం, డిఫెన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు... అన్నింటినీ మీకు అప్పచెప్పి... ధనమంతా మీకు వచ్చేలా చేశారు మా చంద్రబాబు అంటూ పరోక్షంగా ఏపీకి నష్టం చేసారనే కోణంలో మంత్రి కారుమూరి టీడీపీ అధినేతను టార్గెట్ చేసారు. మంత్రి బొత్సా సైతం హరీష్ వ్యాఖ్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. త్వరలో జరిగే తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్ల పైన గురి పెట్టిన బీఆర్ఎష్.. ఏపీలో అభివృద్ధి కోసం తాము ఆలోచన చేస్తున్నామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో తిరిగి బలపడాలని భావిస్తున్న టీడీపీ ప్రయత్నాలకు బ్రేకులు వేస్తున్నారు. గతంలోనూ ఇదే విధంగా ఏపీ - తెలంగాణ మంత్రుల మద్య మాటలు పేలినా..తరువాత సర్దుకుంది. ఇప్పుడు అదే విధంగా సర్దుకుంటారా...ఎన్నికల వరకు సాగదీస్తారా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications