బెంగాల్ లో గెలుపు పై బీజేపీ ధీమా వెనుక, ఇదీ అసలు లెక్క..!!
పశ్చిమ బెంగాల్ లో భారీగా ఓటెత్తారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓటింగ్ శాతం తో కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి. బీజేపీ ఈ పోలింగ్ తమకే అనుకూలమని .. తమదే అధికారమని చెబుతున్నారు. కాగా, మమతా ఓటర్లు మరోసారి తమకే పట్టం కట్టారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత పోలింగ్ రాష్ట్రంలో అధికారం ఎవరిదో డిసైడ్ చేయనుంది. ఈ సమయం లో తొలి విడతలో బీజేపీకి దక్కే సీట్ల పైన ఆ పార్టీ ముఖ్య నేతలు కీలక అంచనాలు వెల్లడించారు.
బెంగాల్ తొలి విడత ఎన్నికల పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. తమ పార్టీకి వచ్చే సీట్ల పైన ఆసక్తి కర లెక్కలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే నని చెప్పుకొచ్చారు. మెుదటి దశ ఎన్నికల్లో 152 స్థానాలకు గాను బీజేపీ 110కి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమన్నారు. రెండో దశలోనూ తామే ఎక్కువ సీట్లు నెగ్గుతామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజీపీనే అంటూ ప్రకటించారు. మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వానికి ఘోర పరాజయం తప్పదని హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. అందుకు మెుదటి దశలో 92.88 శాతం ఓటింగ్ నమోదు కావడమే నిదర్శనమన్నారు.

తొలి విడత పోలింగ్ పై బీజేపీ ధీమా
బెంగాల్ ఓటర్లు అభివృద్ధిని ఎంచుకున్నారని తొలి దశ ఎన్నికలతో స్పష్టమైందని చెప్పుకొచ్చారు. బెంగాల్‌లో మార్పు కోసం ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారన్నారు. మహిళల రక్షణ బీజేపీ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. అవినీతిపరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. బెంగాల్‌లో బీజీపీ, పార్టీ అభ్యర్థులు తమ అంచనాలకు తగినట్లుగా పని చేశారని కితాబిచ్చారు. ఇదే సమయం లో స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించారంటూ ఎన్నికల సంఘం, స్థానిక పోలీసులు, భద్రతా దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చాలా కాలం తర్వాత ఒక్కరి ప్రాణం కూడా పోకుండా జరిగిన బెంగాల్ ఎన్నికలు ఇవేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఈనెల 23న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో 234 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగ్గా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం తొలి దశలో 152 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెల్లడి కానుంది.












Click it and Unblock the Notifications