ఐసీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఐఎస్‌సీఈ(కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం(ఏప్రిల్ 20) సర్క్యులర్ జారీ చేసింది.
'ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎస్‌సీఈ పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయాలని సీఐఎస్‌సీఈ నిర్ణయించింది.' అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అలాగే 12వ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం 16వ తేదీ నుంచి జరగనున్నట్లు తెలిపారు. అయితే ఈసారి ఆఫ్‌లైన్ పద్దతిలో వారికి పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక ఈ ఏడాది 11వ తరగతి అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని... అదే సమయంలో వారికి ఆన్‌లైన్ క్లాసులను షెడ్యూల్ చేయాలని సీఐఎస్‌సీఈ ఆదేశించింది.
Advertisement
Advertisement
కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు కూడా రద్దయిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి.పరీక్షల రద్దు నేపథ్యంలో విద్యార్థుల ప్రతిభపై సీబీఎ్‌సఈ రూపొందించిన నిర్దేశిత ప్రమాణాలు, అంతర్గత అధ్యయనాల ఆధారంగా మార్కులు, ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒకవేళ ఈ విధానంలో కేటాయించిన మార్కుల పట్ల అభ్యంతరాలు ఉంటే... పరీక్షల నిర్వహణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు.
ఇక ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోనూ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పదో తరగతి,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం... వారిని పై క్లాసులకు ప్రమోట్ చేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.