జై శంకర్ తో ఇరాన్ విదేశాంగమంత్రి కీలక చర్చలు.. హార్మూజ్ జలసంధిపై..
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్భంధనం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్- అమెరికా మధ్య తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. తమతో త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు అమెరికాతో యుద్ధం ఇంకా పూర్తికాలేదని ఇరాన్ సైన్యం చెబుతోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలపై ఇరు దేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తో కీలక భేటీ నిర్వహించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు తాము కృషి చేస్తామని పుతిన్ ఇరాన్ కు హామీ ఇచ్చారు. అయితే పుతిన్ తో భేటీ అనంతరం తాజాగా బుధవారం సాయంత్రం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో ఫోన్ లో సంభాషణ జరిపారు అబ్బాస్ అరాగ్చీ. ఇరు దేశాల నాయకులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని జై శంకర్ ఎక్స్ లో పోస్టు చేశారు.

" ఈ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తో సంభాషణ జరిపాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై వివిధ కోణాల్లో చర్చలు జరిపాం. నిరంతరం టచ్ లో ఉండాలని ఇరు దేశాల నేతలం నిర్ణయించుకున్నాం" అని పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని దిల్లీలోని ఇరాన్ కార్యాలయం కూడా వెల్లడించింది. ఇరు దేశాలు.. కాల్పుల విరమణ, ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఇరాన్ నౌకలపై అమెరికా దిగ్బంధనం, అందుకు ప్రతీకారంగా హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ ఆంక్షలపై చర్చలు జరిపినట్లు స్పష్టం చేసింది.
ఇక ఇరాన్- అమెరికా మధ్య ఫిబ్రవరి 28 న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో యుద్ధం తీవ్రతరం అయింది. అయితే యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 11-12 తేదీల్లో జరిగిన శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.












Click it and Unblock the Notifications