విజయ్ విజయ రహస్యం ఇదే!
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఓ చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోతాయి. గత ఐదు దశాబ్ధాలుగా రాష్ట్రం డీఎంకే లేదా ఏఐఏడీఎంకే అనే ధ్రువాల మధ్య తిరుగుతూ వచ్చింది. అయితే ఈ సారి ఈ రెండు పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకులను కాదని.. ఏ పక్షానా లేని తటస్థ ఓటర్లు భారీగా విజయ్ వైపు మొగ్గు చూపారు. పాత పార్టీల పాలనతో విసిగిపోయిన మధ్యతరగతి ప్రజలు, విద్యావంతులు, మార్పును కోరుకునే ఓటర్లు విజయ్ రూపంలో ఓ క్లీన్ నాయకుడిని చూశారు. ఈ తటస్థ ఓటే విజయ్ పార్టీని 100 సీట్ల మార్కును దాటించడంలో కీలక పాత్ర పోషించింది. టీవీకే పార్టీ సాధించిన అద్భుత విజయం వెనుక ఉన్న అసలు రహస్యం తటస్థ ఓటర్ల మద్దతేనని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.
ఓటుగా మారిన అభిమాన గణం
విజయ్ విజయానికి మరో ప్రధాన బలం ఆయనకున్న అశేషమైన అభిమాన గణం. దశాబ్దాలుగా వెండితెరపై 'దళపతి'గా మెప్పించిన విజయ్.. తన అభిమాన సంఘాలను క్రమశిక్షణ గల రాజకీయ సైన్యంగా మార్చుకున్నారు. యువ ఓటర్లు, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువత, విజయ్‌ను తమ ప్రతినిధిగా భావించారు. సినిమాల్లో ఆయన ప్రదర్శించే సామాజిక స్పృహ, నిజ జీవితంలోనూ ఉంటుందని బలంగా నమ్మిన అభిమానులు.. ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. అభిమానమే ఓటుగా మారిన చోట టీవీకే పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

గుత్తాధిపత్యానికి తెరదించిన యోధుడు
అంతేకాకుండా విజయ్ ఎంచుకున్న రాజకీయ వ్యూహం కూడా ప్రధాన పార్టీలను దెబ్బకొట్టింది. ఆయన కేవలం సినిమా గ్లామర్ మీద మాత్రమే ఆధారపడకుండా, సుపరిపాలన, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యలపై దృష్టి సారించారు. డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల సంప్రదాయ ఓటర్లను తనవైపు తిప్పుకోవడం కష్టమని భావించిన విజయ్, నిశ్శబ్దంగా ఉన్న మెజారిటీ ఓటర్లను ఆకర్షించగలిగారు. ఈ 'నిశ్శబ్ద విప్లవమే' తమిళనాడులో ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరదించి, విజయ్‌ను సరికొత్త శక్తిగా నిలబెట్టింది.












Click it and Unblock the Notifications