తమిళనాడు రాజకీయాల్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..??
తమిళనాడు రాజకీయాలు క్షణానికో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కూడా మ్యాజిక్ ఫిగర్ 118 కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మహా అద్భుతం జరుగుతుందంటూ హింట్ ఇచ్చారు. అన్నాడీఎంకే- డీఎంకే మధ్య పొత్తు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అన్బళగన్ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. అయితే అన్నాడీఎంకే- డీఎంకే మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని వీసీకే పార్టీ చెబుతోంది. ఇరు పార్టీల చర్చల నిర్ణయాన్ని బట్టి తమ స్టాండ్ చెబుతామని వీసీకే పార్టీ నేత తిరుమాళవన్ పేర్కొన్నారు.
ఈ మేరకు విజయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు అన్నాడీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్. " ప్రభుత్వం ఏర్పాటు చేసేంత నెంబర్ విజయ్ కు లేదు. టీవీకే పార్టీ కాంగ్రెస్ తో వెళ్లినా మ్యాజిక్ ఫిగర్ దాటట్లేదు. గవర్నర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని మేము భావిస్తున్నాం. మేము కూడా 118 మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. మా నాయకుడు పళనిస్వామి 118 మంది సభ్యుల మద్దతును సంపాదిస్తారు. కచ్చితంగా ఎవరూ ఊహించని అద్భుతం జరగబోతుంది" అని అన్బళగన్ స్పష్టం చేశారు.
అంతేకాక విజయ్ కు రాష్ట్రాన్ని పాలించేందుకు అర్హత లేదని.. అనుభవం లేదని అన్బళగన్ పేర్కొన్నారు. కేవలం సినీ గ్లామర్ తో రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదని అన్నారు. తమ పార్టీ టీవీకే కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడపగల రాజకీయ చతురత విజయ్ వద్ద లేదని ఎద్దేవా చేశారు. ఇక ప్రస్తుతం అన్బళగన్ వ్యాఖ్యలు తమిళనాట రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మరోవైపు మద్దతు కూడగట్టుకునే పనిలో టీవీకే అధ్యక్షుడు విజయ్ ఉన్నారు. ఈ మేరకు లెఫ్ట్ పార్టీలతో విజయ్ ప్రత్యక్షంగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ కు 112 స్థానాలు ఉన్నాయి. వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు రేపు సమావేశం కానున్నాయి. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications