కాగితాలే లేని పుస్తకాల షాపు.. ప్రపంచంలోనే ఫస్ట్ పేపర్‌లెస్ బుక్ స్టోర్ ఇదే !!
పుస్తకం అనగానే చాలామందికి పేపర్లు, అక్షరాలు నిండిన పెద్ద పెద్ద లైబ్రరీలు గుర్తొస్తాయి. అయితే, ఈ సంప్రదాయ భావనను పూర్తిగా మారుస్తూ, ప్రపంచంలోనే మొట్టమొదటి 'పుస్తకాలు లేని బుక్‌స్టోర్' న్యూయార్క్ నగరంలో ప్రారంభమైంది. అమెజాన్ అనుబంధ సంస్థ ఆడిబుల్ దీనికి శ్రీకారం చుట్టింది. నేటి పాఠకులు భౌతిక పుస్తకాల కంటే ఆడియో కథల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఈ వినూత్న స్టోర్ రూపొందించబడింది.
మాన్‌హాటన్‌లోని లోయర్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న ఈ వినూత్న స్టోర్‌కు 'ఆడిబుల్ స్టోరీ హౌస్' అని పేరు పెట్టారు. ఇక్కడ ఒక్క భౌతిక పుస్తకం కూడా కనిపించదు; పుస్తకాల అరలు గానీ, పేజీలు తిప్పే శబ్దం గానీ అస్సలు ఉండవు. ఈ ప్రదేశాన్ని కేవలం ఆడియో కథనాలను పంచుకోవడానికి మాత్రమే డిజైన్ చేశారు. ఆడిబుల్ సీఈఓ బాబ్ కారిగాన్ మాట్లాడుతూ.. "ఆడియో కథలకి ప్రాణం పోసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టింది. ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం" అని పేర్కొన్నారు.

ఈ స్టోర్‌లో 'స్టోరీ టైల్స్' అని పిలిచే ఆడియోబుక్ టాబ్లెట్లుంటాయి. సందర్శకులు వాటిని అక్కడే ఉన్న ప్లేయర్‌లో ఉంచి, హెడ్‌ఫోన్స్‌తో కథల షార్ట్ ప్రివ్యూ వినవచ్చు. నచ్చితే పూర్తి ఆడియోబుక్‌ను ఆడిబుల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హెడ్‌ఫోన్స్ లేకుండా సమూహంగా వినేందుకు స్పీకర్లతో కూడిన ప్రత్యేక గదులున్నాయి. అలాగే, 'లిజనింగ్ బార్' వద్ద ఉండే 'స్టోరీ టెండర్స్' విజిటర్స్ అభిరుచులకు తగ్గ ఆడియోబుక్స్‌ను ఎంపిక చేయడంలో సహాయపడతారు.
అమెరికాలో ఆడియోబుక్స్‌కు భారీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ బుక్‌లెస్ స్టోర్ రావడం విశేషం. ఆడియో పబ్లిషర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం, 2024లో అమెరికాలో ఆడియోబుక్ అమ్మకాలు 2.22 బిలియన్ డాలర్లకు (సుమారు ₹9,491 కోట్లు) చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు అయింది. సంప్రదాయ పుస్తక పఠనం నుంచి ఆధునిక శ్రవణ అలవాట్లను కలబోసి, ఒక అఫ్‌లైన్ ద్వారా సరికొత్త అనుభూతిని అందించడమే ఆడిబుల్ ఈ స్టోర్ ప్రధాన లక్ష్యం.












Click it and Unblock the Notifications