దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఆ జిల్లాల్లో..!
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల గమనం కాస్త మందగించింది. దీంతో బుధవారం పలు జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఉదయం నుంచి ఎండ దంచికొట్టినప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈనెల 3న (శుక్రవారం) వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
4వ తేదీ నుంచి భారీ వర్షాలు.. రాజస్థాన్ వైపు అల్పపీడనం!
ఈ సరికొత్త అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారనుంది. జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 5 నుంచి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఏర్పడబోయే ఈ అల్పపీడనం క్రమంగా రాజస్థాన్ వైపు పయనించవచ్చని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా రుతుపవనాలు వేగంగా విస్తరించి.. తూర్పు, మధ్య, ఉత్తర భారత దేశంలో వర్షాల జోరు బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్రాలో పిడుగుల హెచ్చరిక!
మరోవైపు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గురువారం రోజంతా మేఘావృత వాతావరణం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఢిల్లీకి చేరిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా 'ఎల్లో, రెడ్' అలర్ట్‌లు
ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వాతావరణం చల్లబడింది. గురువారం రాత్రి ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో భారీ వర్షం కురవడంతో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 33°C - 34°C డిగ్రీలకు పడిపోయాయి. ఇక్కడ మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఐఎండీ (IMD) 'ఎల్లో అలర్ట్' ప్రకటించింది.
త్వరలోనే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ పరిధిలోకి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త నరేష్ యాదవ్ తెలిపారు. రానున్న 4-5 రోజుల్లో కొంకణ్ తీరం, గోవా, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. అలాగే ఒడిశా, మధ్య భారత దేశంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.














Click it and Unblock the Notifications