H1B: ట్రంప్ షాక్, ఏటా కోట్లలో జీతం ఉంటేనే వీసా!
అమెరికాలో స్థిరపడాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. H-1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, కనీస వేతన పరిమితిని ఏకంగా 30 శాతం వరకు పెంచుతూ కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ కంపెనీలపై మొదటి ఏడాదిలోనే 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.5 లక్షల కోట్లు) అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, యువ ప్రతిభావంతులకు అమెరికాలో అవకాశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త ప్రతిపాదనల ప్రకారం, శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంట్రీ-లెవెల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ H-1B వీసా పొందాలంటే ఏటా కనీసం 1,62,000 డాలర్లు (సుమారు రూ. 1.35 కోట్లు) సంపాదించాలి. ఇది ప్రస్తుత వేతనం కంటే 30 శాతం ఎక్కువ. అలాగే న్యూయార్క్‌లో కనీస వేతనం 1,32,000 డాలర్లకు, డల్లాస్‌లో 1,13,000 డాలర్లకు పెరగాలి. విదేశీయులు తక్కువ వేతనాలకే పని చేస్తూ అమెరికన్ల అవకాశాలను దెబ్బతీయకుండా చూడటమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ట్రంప్ యంత్రాంగం వాదిస్తోంది.

కంపెనీలపై భారీ ఆర్థిక భారం
వలస డేటా సంస్థలు 'లాఫుల్లీ', 'థ్రెషోల్డ్' విశ్లేషణ ప్రకారం.. ఈ వేతన పెంపు వల్ల విదేశీ నిపుణులను నియమించుకునే పెద్ద కంపెనీలకు మూడేళ్లలో వార్షిక వ్యయం 43 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా, కంపెనీలు అనుభవం లేని యువ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనకాడుతున్నాయి. H-1B వ్యవస్థ దుర్వినియోగం, దోపిడీలతో నిండి ఉందని భావిస్తున్న ట్రంప్, తన రెండో దఫా పాలనలో వలసలను అరికట్టే క్రమంలో భాగంగానే ఈ కఠిన చర్యలు చేపడుతున్నారు.
విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఈ నిర్ణయం అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ గ్రాడ్యుయేట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రెండు దశాబ్దాలుగా అమెరికాలో పట్టభద్రులై, H-1B స్పాన్సర్ పొంది కెరీర్ ప్రారంభించడం ఒక సులభమైన మార్గంగా ఉండేది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల వంటి దిగ్గజాలు కూడా ఈ మార్గంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. అయితే, తాజా మార్పులతో కేవలం స్థాపిత కార్మికులకు (అధిక అనుభవం ఉన్నవారికి) మాత్రమే H-1B పరిమితమయ్యే అవకాశం ఉంది.
టెక్ దిగ్గజాల నిరాశ
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గతంలోనే ఈ తరహా నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఆర్థిక విజయానికి వలసదారులు వెన్నెముక అని, తాజా ఆంక్షలు నిరాశ కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, పెరిగిన ఖర్చుల కారణంగా కొన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను విదేశాలకు తరలించే (Offshoring) అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం టెక్ రంగమే కాకుండా ఆర్థిక, వైద్య, పరిశోధన రంగాలు కూడా ఈ మార్పులతో ప్రభావితం కానున్నాయి.














Click it and Unblock the Notifications