వైట్ హౌస్ డిన్నర్ లో కాల్పులపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ భద్రత లోపం సంభవించింది. ఫలితంగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులను హుటాహుటిన సురక్షిత ప్రదేశానికి తరలించాల్సి వచ్చింది. డిన్నర్ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు దిగటమే దీనికి కారణం. తక్షణమే అక్కడి వారందరూ తమ ప్రాణాలను రక్షించుకోవడానికి కిందికి వంగారు. కొందరు టేబుళ్ల కింద తలదాచుకున్నారు.
వైట్ హౌస్ వార్తలను కవర్ చేసే ప్రెస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ ఇది. వాషింగ్టన్ లోని హిల్టన్ హోటల్ లో అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఏర్పాటైంది. దీనికి డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తో పాటు పలువురు వైట్ హౌస్ అత్యున్నత అధికారులు హాజరయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఉన్నారు. 2,600 మంది అతిథులు పాల్గొన్నారు.

ఆ సమయంలో అతిథుల్లో ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. పలు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లను హుటాహుటిన తరలించారు. వందలాది మంది అతిథులు టేబుళ్ల కింద తలదాచుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయుధాలతో బాంక్వెట్ హాల్ ను అదుపులోకి తీసుకుని, ట్రంప్ దంపతులను హుటాహుటిన సురక్షితంగా బయటికి తరలించారు.
దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గంట తర్వాత తన ట్రూత్ సోషల్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో ఎనర్జిటిక్ గా సాగాల్సిన ఈ డిన్నర్.. ఇలా ముగిసినందుకు చింతిస్తున్నానని అన్నారు. 30 రోజుల్లోపు ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తానని చెప్పారు. కాల్పుల సమయంలో సీక్రెట్ సర్వీస్, లా ఎన్ఫోర్స్మెంట్ అద్భుతంగా పనిచేశాయని కితాబిచ్చారు. భద్రతా బలగాలను ప్రశంసించారు.
ఈ కాల్పులకు దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వాషింగ్టన్ మీడియా తెలిపింది. అతన్ని ప్రాణాలతో పట్టుకున్నారని, కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించింది. కాల్పులకు గల కారణాలు, దీని వెనుక ఉన్న వాస్తవాల గురించి ఏజెన్సీలు దర్యాప్తు సాగిస్తున్నాయని పేర్కొంది. షూటర్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఇంకా తెలియరాలేదు గానీ.. అతను నాన్ అమెరికన్ అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications