హైదరాబాద్ MMTS సెకండ్ ఫేజ్ విస్తరణపై శుభవార్త.. కొత్తగా ఆ రూట్లలో స్టేషన్లు!
హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ mmts సెకండ్ ఫేజ్ విస్తరణ విషయంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటిఎస్ సేవలను మరింత విస్తరించడానికి సిద్ధమవుతోంది. అల్వాల్ లయోలా కాలేజ్, ఆనంద్ బాగ్, మౌలాలి క్వార్టర్స్ ప్రాంతాలలో మూడు కొత్త ఎంఎంటిఎస్ స్టేషన్ లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపించింది.
కేంద్ర రైల్వే శాఖ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే పనులు
త్వరలో వీటికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ స్టేషన్లు ఘట్ కేసర్, సనత్ నగర్ సెక్షన్లో ఏర్పాటు కానున్నాయి. ఇవి వస్తే హైదరాబాద్ చివరి ప్రాంతాలలోని వేలాదిమంది ప్రయాణికులకు రవాణా సమస్యలు తీరనున్నాయి. 10 సంవత్సరాల క్రితమే ఈ సెక్షన్లో 6 స్టేషన్లను నిర్మించాలని ప్రణాళిక ఉండగా, ప్రస్తుతం మూడు స్టేషన్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి.

ఈ ప్రాంతాలలో స్టేషన్ ల కోసం ప్రజల విజ్ఞప్తి
అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద ఎంఎంటీఎస్ స్టేషన్ కోసం స్థానికులు విద్యార్థులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక చర్లపల్లి నేరేడ్మెట్ మధ్య ప్రస్తుతం ఎటువంటి స్టేషన్ లేదు. దీనివల్ల మల్కాజ్గిరి, ఆనంద్ బాగ్ ప్రాంతాల ప్రజలు చాలాదూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. అంతేకాదు మౌలాలిలో రైల్వే క్వార్టర్స్ చుట్టుపక్కల 2000కు పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ స్టేషన్ ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో ఉన్న వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
తెలంగాణా సర్కార్ నిధులు విడుదల
ఎంఎంటీఎస్ రైలు రెండో దశ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా తనవంతు నిధులను విడుదల చేస్తూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తుంది. రైల్వే బోర్డు ఆమోదం వచ్చిన వెంటనే టెండర్లు వేసి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ స్టేషన్ ల ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతాలలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం లభిస్తుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, శివారు ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ద్వారా హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.













Click it and Unblock the Notifications