ఏఐ రేసులోకి ఆదిత్య బిర్లా : 500 మిలియన్ డాలర్ల కంపెనీతో భారీ డీల్ !
ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రైవేట్ క్యాపిటల్ విభాగం ఆదిత్య బిర్లా వెంచర్స్.. అమెరికాకు చెందిన AI స్టార్టప్ ఆర్టికుల్8లో పెట్టుబడి పెట్టింది. ఈ స్టార్టప్ చేపట్టిన $70 మిలియన్ల సిరీస్-B నిధుల సేకరణ రౌండ్‌లో బిర్లా గ్రూప్ భాగస్వామిగా నిలిచింది. దీంతో AI రంగంలో పెట్టుబడులు పెడుతున్న దేశంలోని అగ్ర వ్యాపార సమ్మేళన సంస్థల సరసన ఆదిత్య బిర్లా గ్రూప్ చేరింది.
ఆర్టికుల్8..
కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కేంద్రంగా పనిచేస్తున్న ఆర్టికుల్8.. ఈ తాజా పెట్టుబడితో తమ కంపెనీ విలువ $500 మిలియన్లకు పైగా ఉందని వెల్లడించింది. ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏమిటంటే.. డేటా లీక్ అయ్యే ప్రమాదం లేకుండా, కంపెనీలకు వారి సొంత ఐటీ సర్వర్‌లలోనే పనిచేసే AI మోడల్‌లను అందించడం. దీనివల్ల భద్రతపై ఉన్న అనుమానాలు తగ్గుతాయి.

ఈ AI ప్లాట్‌ఫారమ్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్ తమ సిమెంట్, ఫ్యాషన్, ఫైనాన్స్ వంటి వ్యాపారాల్లో ఉపయోగిస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత ఇవ్వలేదు. అయితే భవిష్యత్తులో గ్రూప్ వ్యాపారాలకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఆర్యమన్ బిర్లా కామెంట్స్..
ఆదిత్య బిర్లా వెంచర్స్ వ్యవస్థాపకుడు ఆర్యమన్ బిర్లా మాట్లాడుతూ.. ఈ స్టార్టప్‌ను నడిపిస్తున్న వ్యవస్థాపక బృందంపై మాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. భవిష్యత్ ప్రపంచ వ్యాపారాలను నిర్మించే కొత్త ఆలోచనలకు మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ఆ దిశలోనే ఉందని తెలిపారు.
ఆదిత్య బిర్లా వెంచర్స్ నేపథ్యం..
2021లో స్థాపించబడిన ఆదిత్య బిర్లా వెంచర్స్‌ను, ప్రైవేట్ ఈక్విటీ మరియు వెంచర్ క్యాపిటల్ రంగాల్లో 17 ఏళ్ల అనుభవం ఉన్న పియూష్ బన్సల్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ఇప్పటివరకు అప్‌టైమ్ AI, దిగంతర వంటి 12 స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది.
భారతీయ సంస్థల్లో AIపై పెరుగుతున్న ఆసక్తి..
ఆదిత్య బిర్లా గ్రూప్ నిర్ణయం, భారతీయ పెద్ద సంస్థలు AI రంగంపై చూపుతున్న ఆసక్తికి మరో ఉదాహరణగా మారింది. ఇప్పటికే TCS, రిలయన్స్, అదానీ గ్రూప్, L&T వంటి సంస్థలు భారీ మొత్తాల్లో AI డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెడుతున్నాయి.
TCS, రిలయన్స్, అదానీ పెట్టుబడులు..
TCS AI వర్క్‌లోడ్స్ కోసం $6.5 బిలియన్లతో 1 GW డేటా సెంటర్ నిర్మించనుంది
రిలయన్స్ వచ్చే ఐదేళ్లలో $11 బిలియన్లతో AI డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది
అదానీ గ్రూప్ గూగుల్‌తో కలిసి $15 బిలియన్ల AI ప్రాజెక్ట్ చేపట్టింది
L&T మూడు సంవత్సరాల్లో $3 బిలియన్ల పెట్టుబడి ప్రకటించింది
AI భవిష్యత్తుపై నిపుణుల అభిప్రాయం..
AIపై ఎక్కువ హైప్ ఉందన్న విమర్శలు ఉన్నప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది తాత్కాలిక ట్రెండ్ కాదని స్పష్టం చేస్తున్నారు. టెక్ నిపుణుడు కశ్యప్ కొంపెల్లా మాట్లాడుతూ.. AI బబుల్‌పై ఆందోళనలు ఉన్నా, అప్లికేషన్లు, వర్క్‌ఫ్లోల విషయంలో AI ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చబోతోంది. పెద్ద సంస్థలు AIని తమ వ్యాపారాల్లో భాగం చేసుకోవడం సహజమే" అని తెలిపారు.












Click it and Unblock the Notifications