"ఆపిల్" కొత్త AI చాట్‌బాట్.. గూగుల్, ఓపెన్‌ఏఐకి చెక్ పెడుతుందా ?
ప్రపంచంలోని అత్యంత లాభదాయక సంస్థలలో ఒకటైన ఆపిల్, కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మాత్రం ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇప్పటికే OpenAI, Google, Anthropic లాంటి సంస్థలు మేటి AI ఫీచర్లతో ముందుకుసాగుతున్న తరుణంలో, ఆపిల్ మాత్రం కొంత వెనుకబడినట్లే కనిపించింది.
గత ఏడాది జరిగిన WWDC సదస్సులో "Apple Intelligence" పేరుతో AI ఫీచర్లను సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన Siri పునరుద్ధరణ మాత్రం నెలల తరబడి ఆలస్యమవుతోంది. Siriతోపాటు ప్రకటించిన ఇతర AI ఫీచర్లు కూడా Google Pixel, Samsung Galaxy సిరీస్‌లలో లభించే ఫీచర్లతో పోలిస్తే అంత ప్రభావవంతంగా అనిపించకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మాత్రం AI పోటీ నుండి వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. "AI ఒక ఇంటర్నెట్ స్థాయిలో మార్పును తీసుకొస్తుంది. ఈ పోరులో ఆపిల్ విజయం సాధించాలి" అని ఉద్యోగులతో టిమ్ కుక్ స్పష్టంగా వెల్లడించినట్లు సమాచారం.
అయితే ప్రముఖ బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆపిల్ ఇప్పుడు ChatGPT తరహాలో శోధన సామర్థ్యాలు కలిగిన స్వంత AI చాట్‌బాట్‌ను అభివృద్ధి చేస్తోంది. పెర్‌ప్లెక్సిటీ (Perplexity) వంటి ఇతర AI శోధన ప్లాట్‌ఫాంలతో భాగస్వామ్యం అవకాశం గురించి గతంలో ఆపిల్ సంకేతాలు ఇచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సంస్థ ఇప్పుడు తనకు ప్రత్యేకమైన శోధన చాట్‌బాట్‌ను రూపొందించడానికి చర్యలు ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే “Answers, Knowledge and Information” అనే పేరుతో (సంక్షిప్తంగా AKI) ప్రత్యేక బృందాన్ని ఆపిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం లక్ష్యం – చాట్‌జీపీటీ తరహాలో AI ఆధారిత శోధన అనుభవాన్ని వినియోగదారులకు అందించడం.
ఈ బృందానికి రాబీ వాకర్ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో Siri అభివృద్ధి బాధ్యతలకూ ఆయనే చీఫ్. ప్రస్తుతం ఆయన నేరుగా ఆపిల్ AI చీఫ్ జాన్ గియానాండ్రియాకు నివేదిక ఇస్తున్నారు. Siriలో AI ఫీచర్ల వలన వచ్చిన జాప్యాల నేపథ్యంలో వాకర్ Siri బాధ్యతల నుంచి తప్పుకున్నా, ఇప్పుడు ఈ కొత్త 'Answer Engine’ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇది ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉంది. అయితే వెబ్‌లో శోధించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా ఒక కొత్త యాప్ రూపకల్పనలో ఉంది. భవిష్యత్‌లో Siri, Spotlight, Safari వంటి యాప్స్‌కి ఈ Answer Engine బ్యాక్‌ఎండ్ సపోర్ట్‌గా పనిచేయనుంది.
కుపెర్టినో కేంద్రంగా ఉన్న ఆపిల్, AKI బృందం కోసం ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. తమ వెబ్‌సైట్‌లో "మా పని Siri, Spotlight, Safari, Messages, Lookup లాంటి ప్రముఖ ఆపిల్ ప్రొడక్ట్స్‌లో సహజమైన సమాచారం అనుభవాన్ని వినియోగదారులకు అందించడమే. ప్రపంచం సమాచారంతో ఎలా కనెక్ట్ అవుతుందో మాతో కలిసి రూపొందించండి!" అంటూ ప్రకటనలు చేసింది.
AI పోరులో ఆపిల్ తన కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోండడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది AI రంగంలో ఆపిల్‌కు గేమ్ చేంజర్‌గా మారుతుందా? లేదా అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.












Click it and Unblock the Notifications