బ్రహ్మోత్సవంతో పాటు అక్టోబర్ లో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు ఏకంగా 84,171 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,671 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.26 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.16 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.61 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,926 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తిరుమలలో త్వరలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం కాబోతోన్నాయి. వీటి తేదీలను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం) లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
వీటితో పాటు అక్టోబర్ లో మరిన్ని విశేష ఉత్సవాలను కూడా నిర్వహించనుంది టీటీడీ. వీటికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఆ మరుసటి రోజే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమౌతాయి. 16న శ్రీవారి బ్రహ్మోత్సవ గరుడ సేవ ఉంటుంది. 20న బ్రహ్మోత్సవాల అవభృథం క్రతువును నిర్వహిస్తుంది టీటీడీ.
అదే రోజు.. శ్రీ వేదాంత దేశికులు శాత్తుమొర కార్యక్రమం జరుగుతుంది. 21వ తేదీన భూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉంటుంది. 26న పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తారు. ఇది ప్రతి నెలా జరిగే కార్యక్రమం. సాయంత్రం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. భక్తులను కటాక్షిస్తారు. దీంతో అక్టోబర్ లో జరిగే పర్వదినాలు, విశేష ఉత్సవాలు ముగుస్తాయి.














Click it and Unblock the Notifications
