వేలమంది ఉద్యోగులకు టాటా
దేశీయ టెక్ దిగ్గజం.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కత్తికి పదును పెట్టుతోంది. వేలాదిమంది ఉద్యోగులను తొలగించడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పని చేస్తోన్న ఉద్యోగుల్లో రెండు శాతం వరకు కోత పెట్టాలని నిర్ణయించుకుంది.
వచ్చే సంవత్సరం కాలంలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకోవాలని నిర్ణయించుకుంది. తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించనుంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే కృతివాసన్ తెలిపారు.

ఇందుకు గల కారణాలను వెల్లడించారు. సంస్థ మరింత వేగంగా, భవిష్యత్తుకు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ తొలగింపులు మిడిల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతివాసన్ అన్నారు.
ఈ మేరకు మనీకంట్రోల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కార్యకలాపాలు కొనసాగుతున్న అన్ని దేశాల్లోనూ ఈ తొలగింపులు ఉంటాయి. 2026 ఆర్థిక సంవత్సరం. అంటే ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 మధ్యకాలంలో ఈ లేఆఫ్ ప్రక్రియ కొనసాగుతుంది. పని విధానాలు మారుతున్నందున, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సంస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని కృతివాసన్ తెలిపారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగిస్తున్నామని, భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలను అంచనా వేస్తున్నామని కృతివాసన్ చెప్పారు. ఉద్యోగుల వృద్ధికి, వారి కెరీర్‌కు ఉపయోగపడే అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన అన్నారు.
కొన్ని డివిజన్లల్లో ఉద్యోగులను నియమించడం అంతగా ఫలితం ఇవ్వట్లేదని కృతివాసన్ పేర్కొన్నారు. ఆయా డివిజన్లల్లో మ్యాన్ పవర్ కంటే కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారానే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టుకోగలమని అంచనా వేశామని చెప్పారు. లేఆఫ్స్ ప్రకటించడానికి ఇదీ ఓ ప్రధాన కారణమని అన్నారు.
ఈ లేఆఫ్స్- సంస్థలో పని చేస్తోన్న గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపుగా రెండు శాతం వరకు ఉంటుందని కృతివాసన్ తెలిపారు. ప్రధానంగా మిడిల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. దీనికి బదులుగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకుంటామని అన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో టీసీఎస్ 6,071 మంది ఉద్యోగులను నియమించుకుంది. జూన్ 30వ తేదీ నాటికి ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 6,13,069కు చేరింది. మొదటి త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికరంగా 5,090 పెరిగింది. అలాగే సర్వీస్ అట్రిషన్ రేటు 13.8 శాతానికి పెరిగింది.
ఈ నెల 10వ తేదీన తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది టీసీఎస్. సంస్థ నికర లాభం 5.98 శాతం పెరిగి.. రూ.12,760 కోట్లకు చేరుకుంది. గత ఏడాది కంటే ఈ మొత్తం అధికం. గత ఆర్థిక సంవత్సరంలో 12,040 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుందీ దేశీయ ఐటీ దిగ్గజం. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ. 63,437 కోట్ల ఆదాయాన్ని సాధించింది.












Click it and Unblock the Notifications