ఆఫీస్ మూసివేయనున్న టాప్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నాష్‌విల్లే కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. అక్కడ పనిచేస్తున్న 200 నుంచి 250 మంది ఉద్యోగులపై లేఆఫ్ వేటు వేయనుంది. ఈ మేరకు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చింది కూడా. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన నాష్‌విల్లే ఆఫీస్ ను మూసివేస్తామని, అదే రోజు నుంచి లేఆఫ్స్ అమలులోకి వస్తాయని తెలిపింది.
టెన్నెస్సీ లోని లో ఉన్న మూర్ బిల్డింగ్‌లో సుమారు 1.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొనసాగుతోందీ నాష్‌విల్లే ఆఫీస్. 2024 లో దీన్ని లీజుకు తీసుకుంది టిక్‌టాక్ మేనేజ్మెంట్. కంటెంట్ మోడరేషన్ టీమ్ ఇక్కడి నుంచే పనిచేస్తోంది. ఈ విభాగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని, అందువల్లే దీన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు టిక్‌టాక్ వివరించింది. అక్టోబర్ 5 నాటికి ఈ కార్యాలయ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు పేర్కొంది.

ఈ ఉద్యోగాల తొలగింపుల నిర్ణయాన్ని టిక్‌టాక్ యూఎస్డీఎస్ జాయింట్ వెంచర్ ప్రతినిధి జానా క్రౌలీ ధృవీకరించారు. సంస్థ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలను మరింత సరళీకృతం చేసేందుకే ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలిపారు. అమెరికాలోని దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన కంటెంట్ అందజేయాలనే ఉద్దేశంతో ఏఐని అడాప్ట్ చేసుకుంటోన్నామని తెలిపారు.
నాష్‌విల్లే కార్యాలయంలో లేఆఫ్‌ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇక్కడి సిబ్బందికి ఇమెయిల్ ద్వారా ఈ సమాచారం అందిందని, కొద్దిమంది ఉద్యోగులను అప్పటికప్పుడే కంపెనీ అందించిన గ్యాడ్జెట్ల నుంచి లాగౌట్ అవ్వాలని ఆదేశించారనీ తెలిపింది., వారికి త్వరలోనే తగిన పరిహారాన్ని అందించనున్నట్లు టిక్‌టాక్ పేర్కొంది.
ఈ తొలగింపులపై అమెరికాకు చెందిన ప్రముఖ లా సంస్థ స్ట్రాస్ బోరెల్లి పీఎల్‌ఎల్‌సీ రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారం లేఆఫ్స్ చేయకుంటే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది. అమెరికా ఫెడరల్ యాక్ట్ వార్న్ ప్రకారం ఉద్యోగుల సామూహిక తొలగింపునకు కనీసం 60 రోజుల ముందే లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలని సూచించింది. టిక్‌టాక్ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే లేఆఫ్ ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు.




Click it and Unblock the Notifications