AI భవిష్యత్తు ప్రమాదంలో పడిందా? ఆంథ్రోపిక్ కొత్త మోడల్స్ బ్యాన్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నెక్స్ట్ జనరేషన్ మోడళ్లు 'Fable 5', 'Mythos 5'లపై అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా ఆంక్షలు విధించింది. జాతీయ భద్రత, సైబర్ సెక్యూరిటీ కారణాలను చూపిస్తూ.. ఈ మోడళ్ల యాక్సెస్‌ను వెనక్కి తీసుకోవాలని అమెరికా అధికారులు ఆదేశించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అత్యాధునిక సాంకేతికతకు, దేశ భద్రతకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు ఏఐ నియంత్రణలపై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అసలేం జరిగింది..? ప్రభుత్వానికి వచ్చిన భయం ఏంటి?
కొద్దిరోజుల క్రితమే ఆంథ్రోపిక్ సంస్థ ఎంతో అడ్వాన్స్డ్ ఫీచర్లతో Fable 5, Mythos 5 మోడళ్లను యూజర్లకు పరిచయం చేసింది. ముందస్తు పరీక్షల సమయంలో ప్రభుత్వ సంస్థల అనుమతులు పొందినప్పటికీ.. విడుదలైన వెంటనే అమెరికా వాణిజ్య శాఖ (Commerce Department) రంగంలోకి దిగింది. జూన్ 12న ఆంథ్రోపిక్ సంస్థకు అత్యవసర ఆదేశాలు జారీ చేస్తూ, ఈ మోడళ్ల వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ మాట వినకపోతే కంపెనీ లైసెన్సింగ్ పరిమితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ప్రభుత్వ అధికారుల ఆందోళనకు ప్రధాన కారణం 'జాతీయ భద్రత'. ఈ కొత్త ఏఐ మోడళ్లకు సాఫ్ట్వేర్లలో ఉండే అత్యంత క్లిష్టమైన లోపాలను (Software Bugs) ఈజీగా కనిపెట్టే సామర్థ్యం ఉంది. ఒకవేళ ఇవి గనుక హ్యాకర్లు లేదా శత్రుదేశాల చేతుల్లోకి వెళ్తే.. ఆ లోపాలను వాడుకుని వినాశకరమైన సైబర్ దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని అమెరికా ప్రభుత్వం భయపడుతోంది. అందుకే విదేశీయులకు, ఐటీ రంగాలకు దీని యాక్సెస్ దొరకకుండా ఆంక్షల కంచె వేసింది.
ఆంథ్రోపిక్ వాదన ఏంటి..? కంపెనీ అసంతృప్తి!
ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై ఆంథ్రోపిక్ సంస్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు పరిశోధకులు 'జైల్బ్రేక్' (Jailbreak) అనే పద్ధతి ద్వారా ఏఐ పరిమితులను దాటి, కొన్ని సాఫ్ట్వేర్ లోపాల సమాచారాన్ని రాబట్టారనే నెపంతో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుందని కంపెనీ అంటోంది. అయితే, ఆ పరిశోధకులు బయటపెట్టిన లోపాలు కొత్తవేమీ కావని, అవి ఇప్పటికే అందరికీ తెలిసిన సాధారణ లోపాలేనని కంపెనీ స్పష్టం చేసింది. పైగా ఈ ఫలితాలు కేవలం తమ మోడళ్లకు మాత్రమే పరిమితం కాదని, మార్కెట్లో ఉన్న ఇతర ఏఐ వ్యవస్థలతో కూడా ఇలాంటివి సాధ్యమేనని వాదిస్తోంది. సైబర్ ముప్పులపై ఆందోళనలను గౌరవిస్తున్నప్పటికీ.. యాక్సెస్‌ను పూర్తిగా నిలిపివేసేంత తీవ్రమైన ఆధారాలు లేవని, ప్రభుత్వ నిర్ణయాలు సాంకేతిక నిజాల ఆధారంగా ఉండాలని సూచించింది.
ఏఐ భవిష్యత్తుపై పడనున్న ప్రభావం!
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంథ్రోపిక్ సంస్థ ప్రస్తుతానికి లొంగిపోయినప్పటికీ.. Fable 5, Mythos 5లను మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ ఘటన మొత్తం ఏఐ రంగానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిదే. ఇప్పటివరకు ఏఐ కంపెనీలు తమ మోడళ్ల భద్రతను స్వయంగా పరీక్షించుకుని విడుదల చేసేవి. కానీ ఇకపై సరికొత్త ఏఐ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చే ముందు కంపెనీలు కఠినమైన ప్రభుత్వ పరీక్షలు, ఫ్రీడం టెస్ట్ లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో కొత్త ఏఐ టెక్నాలజీలు ప్రజల్లోకి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. సామర్థ్యం ఎంత ముఖ్యమో.. సమాజ భద్రత కూడా అంతే ముఖ్యమని ఈ పరిణామం తేల్చిచెప్పింది.














Click it and Unblock the Notifications