రామలక్ష్మణులు పండ్ల దొంగలు.. వలస కూలీలు: ప్రకాష్‌రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా హిందువుల పవిత్ర గ్రంథం రామాయణంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారి, దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి. తాజగా కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణంలోని ప్రధాన పాత్రలైన రామలక్ష్మణులను నేటి కాలపు 'వలస కూలీల'తో పోల్చారు. వారు ఉత్తర భారతం నుండి దక్షిణాదికి వలస వచ్చిన కూలీలని, ఆకలి వేసి ఇక్కడ ఒక పొలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి పండ్లను దొంగిలించారని వ్యాఖ్యానించారు. శ్రీరాముడిని 'పండ్ల దొంగ'గా చిత్రీకరించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది.
దక్షిణాది గిరిజన యజమాని
ఈ వ్యాఖ్యల్లో ఆయన రావణుడిని ఒక 'దక్షిణాది గిరిజన యజమాని'గా పేర్కొన్నారు. రామలక్ష్మణులు దొంగిలించిన పండ్లు ఉన్న తోట రావణుడిదేనని, ఆ యజమాని తన ఆస్తిని రక్షించుకోవడానికి ప్రయత్నించాడని కథనాన్ని మార్చి చెప్పారు. రామాయణాన్ని ఉత్తర-దక్షిణ విభేదాలుగా లేదా 'ఆర్య-ద్రావిడ' పోరాటంగా చూపించే ప్రయత్నం చేశారని ఆయనపై విమర్శలు వస్తున్నాయి. రామాయణ ఘట్టాలకు GST వంటి అంశాలను జోడించి ఆయన ఎద్దేవా చేశారు. పండ్లు దొంగిలించినందుకు శూర్పణఖ వారిని నిలదీసిందని, దానికి జరిమానాగా 2000 డాలర్లు, జీఎస్టీ చెల్లించాలని డిమాండ్ చేసిందని వ్యాఖ్యానించారు. పవిత్ర ఇతిహాసాన్ని ఇలా హాస్యాస్పదంగా మార్చడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం
ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆయనపై మత మనోభావాలను దెబ్బతీసినందుకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఒకవైపు భావప్రకటన స్వేచ్ఛ అని ఆయన మద్దతుదారులు అంటున్నా, మెజారిటీ ప్రజలు మాత్రం ఇది కేవలం పబ్లిసిటీ కోసం లేదా ఒక వర్గాన్ని కించపరచడానికి చేసిన ప్రయత్నమని భావిస్తున్నారు. ఈ వివాదం ఆయన సినీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపుతోంది. ఆయన నటిస్తున్న పెద్ద సినిమాల నుండి ఆయన్ను తొలగించాలని సోషల్ మీడియాలో భారీ డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ఆయనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన నటుడిగా ఉండి, కోట్ల మంది నమ్మకాన్ని హేళన చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో ప్రకాష్ రాజ్ తరుచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications