Alert: B.com జనరల్ కోర్సు ఇక ఉండదు..!
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు చదవాల్సిన కోర్సుల్లోనూ మార్పులు అవసరం. అందుకనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సును ఎత్తివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఈ కోర్సులో ప్రవేశాలు తగ్గుతూ వస్తుండడంతోపాటు సాంకేతికతను జోడించేలా బీకాం కంప్యూటర్స్ కోర్సును ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ నిర్ణయంపై అధ్యాపకుల వాదన మరోలా ఉంది..
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మాత్రమే..
ఏపీ కళాశాల విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీకాం జనరల్ కోర్సుకు బదులుగా బీకాం కంప్యూటర్స్ కోర్సును నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. అయితే, ఈ రెండు కోర్సులు నిర్వహిస్తున్న స్వయంప్రతిపత్తి కళాశాలల్లో కాకుండా ఇతర కళాశాలల్లో మాత్రమే బీకాం కంప్యూటర్ కోర్సు ఒక్కటే అమలవుతుందని స్పష్టం చేసింది. బీకాం జనరల్ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండడం కూడా ఇందుకు కారణంగా తెలిపింది. అందుకే, బీకాం కంప్యూటర్స్ ఒక్కటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. 169 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా, అటానమస్ కళాశాలలు 21 ఉన్నాయి.

సీఎ చేయాలనుకుంటే మాత్రం..
అయితే, సీఏ చేయాలనుకున్న వారు మాత్రం బీకాం జనరల్ కోర్సుల్లోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు. కొత్తగా ఈ కోర్సులో వచ్చిన మార్పుల కారణంగా జీఎస్టీ, ఈ-ఫైలింగ్ వంటి అంశాలపైన పాఠ్యాంశాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ పాఠ్యాంశాలు చదవడం ద్వారా ప్రైవేటు సెక్టార్‌లో ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని, అందుచేత అన్ని కళాశాలల్లోనూ బీకాం జనరల్ కోర్సులు కొనసాగించాలని అధ్యాపకులు కోరుతున్నారు. మరి ఈ వాదనపై కళాశాల విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications