AP DSC 2025: మెగా డీఎస్సీకి కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా ? కేటగిరీ వారీగా..!
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి వివిధ కేటగిరీల్లో 16347 పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్టీటీలు, భాష పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక టీచర్లు ఇలా పలు కేటగిరీలు ఉన్నాయి. వీటిలో కాంపిటీషన్ స్దాయి ఎక్కువగానే ఉంది. దీనికి సంబంధించి వివరాలను ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
రాష్ట్రంలో చాలా కాలం తర్వాత నిర్వహిస్తున్న డీఎస్సీకి అభ్యర్ధుల నుంచి పోటీ కూడా అంతే స్ధాయిలో ఉంది. ఈసారి డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 3.35 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మొత్తం మీద 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరికి జూన్ 6 నుంచి 30వ తేదీ వరకూ కేటగిరీల వారీగా పరీక్షలు నిర్వహించబోతున్నారు.

ఈ లెక్కన చూస్తే ఈసారి మెగా డీఎస్సీలో ఒక్కో పోస్టుకు 35 మంది వరకూ పోటీ పడుతున్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సగటున 28 మంది పోటీ పడుతున్నారు. అలాగే ఎస్టీజీ పోస్టులకు ఒక్కోదానికీ 25 మంది వరకూ పోటీ పడుతున్నారు. పీజీటీ పోస్టులకు అయితే ఏకంగా 152 మంది వరకూ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జాతీయ స్ధాయిలో వివిధ పోటీ పరీక్షల సగటుతో పోలిస్తే ఇది తక్కువే అయినా రాష్ట్రంలో మాత్రం ఎక్కువే అని చెప్పవచ్చు.
ఇప్పటికే డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు విద్యాశాఖ హాల్ టికెట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 150 సెంటర్లలో పరీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రతీ రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. జూన్ 30న పరీక్షలు ముగిశాక మూల్యాంకనం చేపట్టి ఆగస్టు రెండో వారానికి ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఎంపికైన టీచర్లకు వెంటనే పోస్టింగ్స్ ఇచ్చి స్కూల్స్ కు పంపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications