2018 గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన హైకోర్టు-అభ్యర్ధులకు జగన్ సర్కార్ కీలక హామీ..!
ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో రెండుసార్లు వ్యాల్యూయేషన్ నిర్వహణను సవాల్ చేస్తూ అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆరు వారాల్లో మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పింది. దీంతో ఆ పరీక్ష రాసిన అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.
2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల ప్రశ్నాపత్రాల్ని అప్పట్లో వివిధ కారణాలతో అధికారులు రెండుసార్లు మూల్యాంకనం చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అప్పట్లోనే అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల్ని రెండుసార్లు మూల్యాంకనం చేయడం చెల్లదని తీర్పు ఇచ్చింది. అంతే కాదు తిరిగి ఆరు వారాల్లో పరీక్షలు నిర్వహించి తిరిగి ఎంపికలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అప్పట్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్ధుల్లో టెన్షన్ నెలకొంది.

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించింది. 2018 గ్రూప్ -1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందవద్దని ప్రభుత్వం సూచించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొంది. వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని గౌరవ హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. ఎవరికీ ఆందోళన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.












Click it and Unblock the Notifications