AP TET 2024 : రికార్డు స్థాయిలో టెట్ అప్లికేషన్లు.. ఎంతమంది అప్లయ్ చేశారో తెలుసా..?
ఏపీలో టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగిసింది. అయితే, ఈసారి ఏపీ టెట్ 2024 పరీక్షకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. టెట్ 2024 పరీక్షకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎకు 1,82,609 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 1- బీకు 2,662 మంది చొప్పున అప్లికేషన్లు వచ్చాయి.
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఎ) టీచర్ విభాగంలో పేపర్ 2-ఏ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకుంటే, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగానికి 1,04,788 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇక, సోషల్ స్టడీస్‌కు సంబంధించి 70,767 మంది అప్లయ్ చేసుకుంటే, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 2- బీ విభాగానికి గాను 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈసారి 4 లక్షల అప్లికేషన్లు దాటాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 3వ తేది నుంచి 20వ తేది వరకు ఏపీ టెట్ పరీక్షలు 2024 పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు అభ్యర్థులంతా పూర్తి సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ ప్రకటన..
రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహణ తప్పనిసరి అనే నిబంధనతో ప్రభుత్వం మరోసారి టెట్ పరీక్షల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగానే జులై 2వ తేదీన ఏపీ విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి టెట్ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెట్ దరఖాస్తు గడువు ఆగస్టు 3తో ముగిసింది.












Click it and Unblock the Notifications