Live-in Relationship జంటలకు షాక్. కొత్త చట్టంలో కఠినమైన రూల్స్
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి (UCC)పై చర్చ జరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమైంది. ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం రాష్ట్రాల బాటలోనే తమ రాష్ట్రంలోనూ 'యూసీసీ'ని అమల్లోకి తీసుకురావడానికి ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ చట్టం గనుక అమల్లోకి వస్తే ముఖ్యంగా సహజీవనం సాగించే జంటలపై పెను ప్రభావం పడనుంది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండాలనుకునే వారు ఇకపై ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే కఠినమైన శిక్షలు అనుభవించక తప్పదని ఈ ముసాయిదా హెచ్చరిస్తోంది.
ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదిత బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీనికి ముందు జూలై 19న జరిగే ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదాకు ఆమోదం తెలపనున్నారు.

తప్పనిసరి రిజిస్ట్రేషన్.. ఉల్లంఘిస్తే జైలు శిక్ష!
కొత్త నిబంధనల ప్రకారం.. సహజీవనం చేయాలనుకునే జంటలు తాము నివసించే పరిధిలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనస్పర్థల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకుంటే, ఆ విషయాన్ని కూడా అధికారికంగా తెలియజేసి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయించుకోవాలి.
ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రహస్యంగా సహజీవనం సాగిస్తే గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో కఠిన నిబంధనలు పెట్టారు. కేవలం జంటలకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా ఈ బంధం గురించిన సమాచారాన్ని అధికారికంగా చేరవేస్తారు. అంతేకాకుండా, స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా రిజిస్టర్డ్ సహజీవన జంటల వివరాల రికార్డులను భద్రపరుస్తారు.
ఇంటి యజమానులకు, పక్కింటి వారికి ఫిర్యాదు చేసే ఛాన్స్!
ఈ చట్టంలో పొందుపరిచిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎవరైనా జంట రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లు తెలిస్తే పక్కింటి వారు కానీ, వారుంటున్న అద్దె ఇంటి యజమాని (ల్యాండ్‌లార్డ్) కానీ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు సదరు జంటపై చర్యలు తీసుకుంటారు.
మరోవైపు సహజీవనంలో ఉండే మహిళలకు ఈ చట్టం పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ పురుషుడు తన భాగస్వామిని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే .. ఆమెకు సదరు పురుషుడు తప్పనిసరిగా భరణం చెల్లించాల్సి ఉంటుంది.
ఆస్తి హక్కుల్లో కీలక మార్పులు.. తండ్రికీ వాటా!
ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి మరణిస్తే అతని ఆస్తి భార్య, పిల్లలు, తల్లికి మాత్రమే దక్కుతుంది. కానీ కొత్త యూసీసీ ముసాయిదాలో దీనిని సవరించారు. ఇకపై మరణించిన వ్యక్తి ఆస్తిలో అతని తండ్రికి కూడా చట్టబద్ధమైన వారసుడిగా భాగస్వామ్యం కల్పించనున్నారు. అలాగే చట్టంలో 'తల్లి' అనే పదానికి బదులుగా 'తల్లిదండ్రులు' అని మార్పు చేయనున్నారు. దీనివల్ల ఒకవేళ తల్లి జీవించి లేకపోయినా, తండ్రికి ఆస్తిపై హక్కులు దక్కుతాయి.
గిరిజనులకు మినహాయింపు
మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపు 21 శాతం మంది గిరిజన సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ప్రస్తుతానికి ఈ ఉమ్మడి పౌర స్మృతి నుంచి వారికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఈ బిల్లు విజయవంతంగా చట్టసభ ఆమోదం పొందితే.. సొంతంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ కూడా చేరనుంది.














Click it and Unblock the Notifications