తెలంగాణలో వర్షాలపై ఆందోళన.. మరో వారంరోజులు వానలు లేనట్టే!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా అన్నదాతలు వర్షాభావ పరిస్థితులతో సాగుకు భయపడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 28 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. జూన్ ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణంగా 214.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, కేవలం 154 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయింది. ఈ పరిస్థితి రాష్ట్ర రైతాంగానికి ఆందోళన కలిగిస్తుంది
వర్షాలపై వాతావరణ శాఖ అప్డేట్
ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రంలో వర్షాలపైన తాజా సమాచారం అందించారు. దీని ప్రకారం మరో వారం రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొన్నారు. జూలై 20వ తేదీ వరకు ఎండాకాలం మాదిరిగా ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితి మళ్ళీ అంచనా వేస్తామన్నారు.

రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఎల్ నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ప్రభావవంతంగా లేకపోవడం వల్ల వర్షాలు పడటం లేదు. దీంతో జూలై మాసం ఎండాకాలంలో ఎండలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ 35.6 డిగ్రీలు, ఖమ్మం జిల్లాలో 36.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో నిన్న అత్యధికంగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఇది సాధారణం కంటే 6.9 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.
సాగునీటికి, తాగునీటికి కటకట
రాష్ట్రంలో వర్షాలు కురవని కారణంగా తాగునీరు, సాగునీటికి సమస్యలు తలెత్తుతున్నాయి. జలాశయాలలో నీరు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటుంది. ఎగువ రాష్ట్రాల నుండి వరద కూడా దిగువకు రావటం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాల కోసం రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ సంవత్సరం వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ప్రభావితం అవుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రభుత్వం ఇప్పటినుంచి అవసరం ప్రధానంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications