ఏపీ విద్యార్థులకు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంస్థల్లోని కన్వీనర్ కోటా సీట్లలో ఈసారికి ఏపీ విద్యార్థులూ చేరొచ్చని వెల్లడించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పాత విధానమే వర్తింస్తుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త విద్యాసంవత్సరం(2024-25)లో ఇంజినీరింగ్ తదితర వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో గతంలో మాదిరిగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా కన్వీనర్ కోటాలోని 15 శాతం నాన్‌లోకల్ సీట్లకు పోటీ పడి దక్కించుకోవచ్చు. ఈ విషయంపై ఎప్‌సెట్ ఫలితాల విడుదల సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.

జూన్ 2లోపు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ వెలువరించడంతో ఏపీ విద్యార్థులు కూడా రాష్ట్రంలో ప్రవేశాలు పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణలోని విద్యాసంస్థల్లోనూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సీట్లు పొందేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కన్వీనర్ కోటాలోని 15 శాతం స్థానికేతర(నాన్‌లోకల్) సీట్లకు వారు కూడా ప్రవేశాలకు పోటీపడేలా, అప్పటివరకు ఉన్న విధానాన్ని పదిసంవత్సరాల పాటు పొడిగించారు.
2014 జూన్ 2న అమలులోకి వచ్చిన ఈ విధానం, 2024 జూన్ 2 వరకు అమల్లో ఉంటుంది. 2014 నుంచీ ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగానే రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నాన్‌లోకల్ కోటా కింద ఏపీ విద్యార్థులు సీట్లు పొందుతున్నారు. ఇక, ఎప్‌సెట్‌తోపాటు వివిధ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ఉన్న సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగితా 15 శాతంలో ఏపీ విద్యార్థులు సీటు దక్కించుకోవచ్చు.












Click it and Unblock the Notifications