సింగరేణి కారుణ్య నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. సింగరేణి కారుణ్య నియామకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారసుల గరిష్ట వయో పరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కారుణ్య నియామక ఉద్యోగులకు వయో పరిమితి పెంచుతున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.
గతంలో సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా ఉండగా, కార్మిక సంఘాల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గరిష్ట వయోపరిమితిని 40 ఏళ్లకు పెంచారు. 2018 మార్చి 9 కటాఫ్ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు సింగరేణి సీఎండీ వెల్లడించారు. ఈ ఉత్తర్వులతో 300 మంది నిరుద్యోగులు తక్షణమే లబ్ది పొందనున్నారు. వీటితోపాటు సింగరేణి కార్మికుడు మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పించనున్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమంలో భాగంగా వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఇతర వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన కార్మికులను, వారి కుటుంబాలకు రూ.కోటి బీమా సదుపాయాన్ని సంస్థ అందిస్తోంది.

పలు మౌళిక సదుపాయాలకు శ్రీకారం..
సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీలను, ఇంజినీరింగ్ కాలేజీలను ఆధునీకరించాలని నిర్ణయించింది. సింగరేణిలోని 6 ప్రాంతాల పరిధిలో 42 వేలకు పైగా కార్మికులు ఉన్నారు. వీరంతా చాలా వరకు పాత క్వార్టర్స్‌లోనే ఉంటున్నాయి. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కార్మికులు ఫిర్యాదులు చేశారు. పాత క్వార్టర్స్ తొలగించి వాటి స్థానంలో మోడ్రన్క్వార్టర్స్ నిర్మించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సింగరేణిలోని ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌గా రూపొందించాలని యాజామాన్యం ఆలోచిస్తోంది. కొత్తగూడెం, రామగండంతో పాటు పలు ప్రాంతాల్లో ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయాలని సింగరేణి సంస్థ యోచిస్తోంది.












Click it and Unblock the Notifications