AP Kaushalam : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కౌశలంతో 2026లో ఉద్యోగమస్తు
మీరు ఇంజినీరింగ్ పూర్తిచేసి జాబ్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ఒక గుడ్ న్యూస్. వచ్చే నాలుగు నెలల్లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు చేసుకోవాల్సింది జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఇలా చేస్తే ప్రైవేటు కంపెనీలు తమ అవసరాలకు సరిపడా స్కిల్స్ ఉన్నవారిని అందులోంచి ఎంపిక చేసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికోసం కౌశలం పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. మరి ఇందులో ఎలా రిజిస్టర్ కావాలో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీలసు పూర్తిచేసిన వారు, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు, నిరుద్యోగులు, ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా.. అర్హతకు తగని వృత్తిలో ఉన్నవారిని ఏపీ ఐటీ శాఖ గుర్తించింది. వీరందరూ కలిసి 24 లక్షల మంది ఉన్నారు. ఈ వివరాలన్నీ ఆర్టీజీఎస్‌లోని డేటాలేక్ ద్వారా సేకరించి, క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే పరిశీలించారు. వీరితో పాటు ఉద్యోగాలు కల్పించే కంపెనీలను కూడా ఒకే వేదిక మీదకు తీసుకవచ్చారు. ఇందుకోసం అర్హతలను బట్టి అభ్యర్థులు, కంపెనీలు, జాబ్ అగ్రిగేటర్లకు వారధిలా 'కౌశలం' పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కౌశలం పోర్టల్ లో ఉద్యోగాలు కల్పించే కంపెనీలు, నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థలు, టెస్టింగ్ ఏజెన్సీలు, అభ్యర్థులు ఉంటారు. దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందరికి లాగిన్ ఐడీ..
పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసిన వారికి ఒక లాగిన్ ఐడీని కల్పిస్తారు. లాగిన్ కాగానే మీ వివరాలు పూర్తిగా ఇవాల్సి ఉంటుంది. అభ్యర్థుల టాలెంట్ ను జాబ్స్ ఇచ్చే సంస్థలకు అందించేలా ఒక ఎగ్జామ్ పెడతారు. వాటిలో వచ్చిన పర్సెంటేజ్ ఆధారంగా మీకు గ్రేడింగ్ ఇస్తారు. మీ గ్రేడ్ ఆధారంగా కంపెనీలు మీకు ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించుకుంటాయి. దీని ద్వారా మీకు ఏ రంగంలో ఉద్యోగాలు రావొచ్చు? దానికి కావాల్సిన నైపుణ్యాలేంటి? ఇందుకోసం ఎలాంటి సర్టిఫికెట్ కోర్సులు చేయాలి? తదితర వివరాలు ఆయా వ్యక్తుల ఇన్‌బాక్స్‌లో కనిపిస్తాయి.

సంక్రాంతి తర్వాత జాబ్ ఫెయిర్..
కౌశలంపై ప్రచారానికి జనవరి మొదటి వారంలో ప్రారంభిస్తామని ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలియజేశారు. మెట్రో సిటీలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, దిల్లీ నగరాల్లో దీనిపై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పిస్తామని తెలిపారు. పోర్టల్‌లో రిజిస్టరైన కంపెనీలు, అగ్రిగేటర్లతో సంక్రాంతి తర్వాత 'ఐటీ జాబ్ ఫెయిర్' నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కౌశలం డేటాబేస్‌లోని అభ్యర్థులకు ఈ ఫెయిర్‌లోనే కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించవచ్చు. అర్హులకు అక్కడికక్కడే ఉద్యోగాలు ఆఫర్ చేయొచ్చు.
త్వరలో కాలేజీలలో కూడా
కౌశలం పోర్టల్ లో రాష్ట్రంలోని అన్ని కాలేజీలను చేర్చాలని అధికారులు భావిస్తున్నారు. డిగ్రీ చివరి ఏడాది, బీటెక్ మూడో, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా తాజా సమాచారం అందుతుంది. వారు గ్రాడ్యూయేషన్ పూర్తై జాబ్ మార్కెట్‌కు వెళ్లేలోగా.. నేర్చుకోవాల్సిన కోర్సులేంటి? వచ్చే ఏడాదిలో ఏఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండొచ్చన్న సమాచారం విద్యార్థులు, ప్రొఫెసర్లు, కళాశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ కూడా ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నారు.












Click it and Unblock the Notifications