గుండు గీయించుకుంటే 15 వేలు - 'విక్రమార్కుడు' మూవీ సీన్ రిపీట్..!!
విక్రమార్కుడు సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో హీరో డబ్బు కోసం స్వామీజీ వేషంలో మాయమాటలతో మహిళలకు అరగుండు కొట్టిస్తాడు. ఇప్పుడు సేమ్ ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటు చేసుకుంది. గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. ఇందు కోసం మహిళలను నమ్మించేందుకు కరోనా తరహా జబ్బుతో ముడిపెట్టారు. ఆ తరువాత ఇదంతా నిజం కాదని తెలుసుకొని గుండు చేయించుకున్న మహిళలు ఫిర్యాదు చేసారు.
తమిళనాడులోని సేలం జిల్లాలో మహిళలకు గుండు చేయించుకుంటే రూ 15 వేలు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు. దీనిని నమ్మి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి గుండు చేయించుకుంటే రూ.15 వేలు అందుతాయని చెప్పాడు. దీనివల్ల కొత్తరకం వ్యాధి రాదని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన కొందరు మహిళలు గుండు కొట్టించుకున్నారు. ఆ తర్వాత ఇది ఆకతాయి పని అని తెలిసి లబోదిబోమన్నారు.

సేలం లోని పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని చెప్పాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారినపడిన మహిళలంతా గుండు గీయించుకుని ప్రాణాలతో బయటపడ్డారని, అందువల్ల ఇక్కడా ఆ విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని నమ్మే విధంగా చెప్పాడు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గీయించుకున్న మహిళలకు తలో రూ.15 వేలు.. పాఠశాల, కాలేజీ విద్యార్థినులైతే రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకైతే రూ.6వేలు చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని నమ్మేలా విషయాలు.. కుటుంబలోని వ్యక్తుల వివరాలు చెప్పుకొచ్చాడు. అయితే.. ముందుగా 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని, రికార్డుల్లో పళనియమ్మాళ్ పేరు ఉండటంతో ఫోన్ చేసినట్లు చెప్పాడు.
పళనియమ్మాళ్ ఈ విషయం చుట్టుపక్కల అమ్మలక్కలందరికీ చెప్పేయడంతో వారు క్షురకుడిని పిలిపించుకుని గుండు గీయించుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా నిజమని నమ్మిన ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం ఆ అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేయగా... స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో అనుమానం వచ్చిన పళనియమ్మాళ్ బృందం గుండు చేయించుకోవటం నిలిపివేసారు. తరువాత ఆరా తీయగా తాము మోసపోయామని గుర్తించారు.














Click it and Unblock the Notifications