Minimum Balance: ఖాతాదారులకు షాక్.. పార్లమెంట్‌లో సంచలన వివరాలు!
సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు బ్యాంకులు పెద్ద కన్నమే వేస్తున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేదనే కారణంతో డిపాజిటర్ల నుంచి బ్యాంకింగ్ రంగాలు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశాయి. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.7,000 కోట్లకు పైగా సొమ్మును పెనాల్టీల రూపంలో ఖాతాదారుల నుంచి గుంజినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది.
ప్రైవేటు బ్యాంకులదే అగ్రస్థానం
కనీస నిల్వల నిబంధనలతో అత్యధికంగా లాభపడింది ప్రైవేటు బ్యాంకులేనని సమాచారం స్పష్టం చేస్తోంది. ప్రైవేట్ రంగానికి చెందిన 19 బ్యాంకులు కలిసి మొత్తం రూ.4,948.71 కోట్లను పెనాల్టీగా వసూలు చేశాయి. ఇందులో ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల నుంచే రూ.1,798.14 కోట్లు జమ కాగా, యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లు రాబట్టింది. ప్రైవేట్ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం కలెక్షన్స్ లో ఈ రెండు బ్యాంకుల వాటానే దాదాపు 58 శాతం ఉండటం గమనార్హం.

ప్రభుత్వ బ్యాంకుల బాదుడు కూడా తక్కువేమీ కాదు
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ప్రకారం.. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల కూడా మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న నెపంతో రూ.2,137.92 కోట్లను ఖాతాదారుల ఖాతాల నుంచి మినహాయించుకున్నాయి. అయితే, ప్రధానమంత్రి జన్ ధన్ యోజనతో పాటు ప్రాథమిక పొదుపు ఖాతాలకు ఈ రకమైన పెనాల్టీ మినహాయింపు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. అందుబాటులోకి నూతన రుణాలు
మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని మంత్రి వివరించారు. నాన్ పెర్ఫార్మింగ్ ఆస్తులు రికార్డు స్థాయిలో తగ్గడంతో పాటు లాభాల బాట పట్టాయని పేర్కొన్నారు. అలాగే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాల్లో తలనెత్తిన ద్రవ్యలభ్యత సమస్యల నివారణకు మే 2026లో 'ECLGS 5.0' పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు100 శాతం, ఇతర రంగాలకు 90 శాతం గ్యారెంటీతో దాదాపు రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు సభకు వివరించారు.












Click it and Unblock the Notifications