7 వేల మందికి పైగా విద్యార్థులకు HIV పాజిటివ్: ప్రభుత్వం సంచలన నిర్ణయం!
కర్ణాటక యువతలో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా దాదాపు 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ సోకినట్లు గుర్తించడంతో రాష్ట్రసర్కారు అప్రమత్తమైంది. రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలల్లో హెచ్‌ఐవీ పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో ఈ శిబిరాలను తప్పనిసరి చేయాలని ఆరోగ్య శాఖాధికారులు ఆదేశించారు.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (నాకో) నివేదిక ప్రకారం.. దేశంలో హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారి సంఖ్యలో కర్ణాటక రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 260,000 మంది హెచ్‌ఐవీతో జీవిస్తుండగా.. వారిలో కేవలం 205,000 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. సుమారు 54,000 మందికి ఇప్పటికీ తమ హెచ్‌ఐవీ స్థితి గురించి తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయంగా మారింది.

18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతలో ఈ ఇన్ఫెక్షన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని డేటా చూపిస్తోంది. ఈ వయస్సు వారిలో హెచ్‌ఐవి పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 2023-24లో 44,500 నుంచి 2025-26లో 66,600కు గణనీయంగా పెరిగింది. తాజా నివేదికల ప్రకారం 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 7,000 మందికి పైగా విద్యార్థులకు ఇటీవల హెచ్‌ఐవి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలలో హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.














Click it and Unblock the Notifications