కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు ముందే జీతాలు, పెన్షన్లు..! బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ నెలాఖరులో బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల పాటు సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులకు (Central Govt Employees) సెప్టెంబర్ నెల జీతాలు ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించింది. అలాగే పెన్షనర్లకు సైతం సెప్టెంబర్ నెల పెన్షన్లు ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్దిక మంత్విత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా మూడు రోజుల బ్యాంక్సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వేతనాలు, పెన్షన్లను సెప్టెంబర్ 25న ముందుగానే చెల్లించేందుకు అనుమతించింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె జరగబోతోంది. ఈ సమయంలో బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చెల్లింపులకు కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్స్ విభాగాల ఉద్యోగులకు కూడా సెప్టెంబర్ జీతాలు సెప్టెంబర్ 25న చెల్లించవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది.

పారిశ్రామిక ఉద్యోగుల సెప్టెంబర్ వేతనాలను కూడా ఈ నెల 25వ తేదీన ముందస్తుగా చెల్లించవచ్చని ఆర్ధిక శాఖ తెలిపింది. అలాగే, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సెప్టెంబర్ నెల పెన్షన్‌ను కూడా సెప్టెంబర్ 25న బ్యాంకులు/పే అండ్ అకౌంట్స్ ఆఫీసులు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ ముందస్తు చెల్లింపులను అడ్వాన్స్ పేమెంట్స్‌గా పరిగణిస్తారు. పూర్తి నెల జీతం, వేతనం లేదా పెన్షన్ లెక్కలు ఖరారైన తర్వాత ఏదైనా సర్దుబాటు అవసరమైతే, అక్టోబర్ 2026 జీతం నుంచి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తారు. సెప్టెంబర్ నెల ప్రస్తుత త్రైమాసికం ముగింపు రోజులతో కూడా సమీపంగా ఉండటంతో, ఆలస్యం, అంతరాయాలను నివారించేందుకు వీలైన చోట్ల ఇతర చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీలను కూడా ముందుగానే ప్రాసెస్ చేయాలని కేంద్రం సూచించింది.













Click it and Unblock the Notifications
