రెండు అత్యాచారం కేసుల్లో స్టార్ క్రికెటర్!!
ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో తీవ్ర సంచలనం నమోదైంది. ఎసెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు చెందిన 24 ఏళ్ల యువ టాపార్డర్ బ్యాటర్ రాబిన్ దాస్ తీవ్రమైన అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మెట్రోపాలిటన్ పోలీసులు అతడిపై రెండు విడివిడిగా నమోదు చేసిన అత్యాచారం కేసుల్లో అభియోగాలు నమోదయ్యాయి. 2026 జులైలోనే ఆయనపై అధికారికంగా ఛార్జీలు నమోదు కాగా.. ఈ వ్యవహారంపై ఇప్పుడు న్యాయస్థానంలో విచారణ ఊపందుకుంది. రాబిన్ దాస్ అక్టోబర్ 9న ఇన్నర్ లండన్ క్రౌన్ న్యాయస్థానం ముందుకు విచారణ నిమిత్తం హాజరుకానున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది అత్యాచారం చేశాడనే అనుమానంతో రాబిన్ దాస్‌ను తొలిసారిగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై లోతుగా దర్యాప్తు నిర్వహించిన మెట్రోపాలిటన్ పోలీసులు 2026 జులై 23న ఆయనపై రెండు ప్రధాన అత్యాచార అభియోగాలను నమోదు చేశారు. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తక్షణమే ఎసెక్స్ క్రికెట్ క్లబ్ తీవ్రంగా స్పందిస్తూ ఆయనను జట్టు నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసింది. జులై 21న మిడిల్‌సెక్స్‌తో జరిగిన వన్-డే కప్ మ్యాచ్‌లోనే రాబిన్ దాస్ చివరిసారిగా ఎసెక్స్ తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత నుంచి ఆయనకు క్రికెట్ కార్యకలాపాల్లో చోటుదక్కలేదు.

ఈ వివాదంపై ఎసెక్స్ క్లబ్ స్పందిస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ కాంట్రాక్టు కలిగిన ఆటగాడు కోర్టులో హాజరైనట్లు ధ్రువీకరించింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్, క్రికెట్ నియంత్రణ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని క్లబ్ స్పష్టం చేసింది.
బ్రిటీష్-బంగ్లాదేశ్ జాతీయుడైన రాబిన్ దాస్‌కు లండన్‌లోని లేటన్‌స్టోన్‌లో జన్మస్థలం కాగా.. ఆయన తండ్రి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ రంగానికి చెందినవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో హిస్టరీ చదివిన రాబిన్ దాస్, ఎసెక్స్ అకాడమీ ద్వారా ఎదిగి ఫస్ట్-క్లాస్ క్రికెట్లో నిలదొక్కుకున్నారు. 2023లో ఐర్లాండ్ జట్టుపై జరిగిన అరంగేట్ర ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లో కేవలం 101 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా 2023 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఢాకా డొమినేటర్స్ ఫ్రాంచైజీకి ఆడటంతో పాటు 2022లో లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కూడా సేవలందించారు. కౌంటీల్లో మెరుగైన భవిష్యత్తు ఉందనుకున్న సమయంలో ఈ కేసుల కారణంగా ఆయన క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది.














Click it and Unblock the Notifications
