గుడ్‌న్యూస్: డిసెంబర్ నాటికి స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొత్తగా 50వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలై అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో డిసెంబర్ చివరి నాటికి దేశంలో సుమారు 50వేల కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు స్మార్ట్ ఫోన్ పరిశ్రమ సిద్ధమైంది.
Recommended Video

దేశీయ సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు కూడా..
కేద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రొడక్షన్-లింక్డ్-ఇన్సెంటివ్(పీఎల్ఐ) ఆధారంగా పలు దేశీయ, అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, శామ్‌సంగ్, డిక్సన్, లావా కొత్త తయారీ ప్లాంట్లను మనదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసేందుకు ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)ను ఏప్రిల్ 1న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది.
ఈ స్కీమ్ కింద ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తోంది. ఇండియాలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను ఇక్కడే తయారు చేసేందుకు తగిన సహాయం తయారీ సంస్థలకు అందిస్తోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఇక్కడే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తోంది.

డిసెంబర్ నాటికి 50వేల కొత్త ఉద్యోగాలు
ఇండియా సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) అధ్యక్షుడు పంకజ్ మోహింద్రూ మాట్లాడుతూ.. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమ 1100 శాతం అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయని తెలిపారు. కరోనా కారణంగా ఈ పరిశ్రమ కొంత ఒడిదుడుకులకు గురైనప్పటికీ.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందని తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి దేశంలోని స్మార్ట్ ఫోన్ తయారీ పరిశ్రమల్లోనే 50వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని వివరించారు. 2014-2019 మధ్య కాలంలో 1100 శాతం వృద్ధి సాధించిందని, కరోనా కారణంగా కొంత అమ్మకాలు మందగించినప్పటికీ.. ఇప్పుడు దేశంలో దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేస్తుండటంతో మళ్లీ అమ్మకాలు జోరందుకుంటున్నాయని పంకజ్ వెల్లడించారు.

మేకిన్ ఇండియా కోసం.. రూ. 50వేల కోట్లతో కొత్త స్కీమ్
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఉద్యోగావకాశాల సృష్టికి కీలకంగా మారాయని తెలిపారు. ఈ ఉత్పత్తులు వినియోగదారుడికి చేరే వరకు అనేక మందికి ఉపాధిని కల్పిస్తాయని వెల్లడించారు.
భారత ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ స్కీమ్స్ కింద రూ. 50,000 కోట్లను ఈ ఏడాది జూన్ నెలలో వెచ్చించింది. దేశంలో దేశీయ సంస్థలతోపాటు ఇతర అంతర్జాతీయ తయారీ సంస్థలు కూడా మనదేశంలోనే పరిశ్రమలను స్థాపించి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసేందుకు అవకాశం కల్పించింది.

దేశంలోనే తయారీ.. స్వయం సమృద్ధి..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఉత్పాదక కేంద్రంగా మార్చడంలో భాగంగానే ప్రభుత్వం ఈ స్కీమ్స్ ప్రవేశపెట్టిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన ‘ఆత్మనిర్భర్ భారత్'లో భాగంగా స్వయం సమృద్ధే లక్ష్యంగా ఈ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. దేశీయంగానే ఎలక్ట్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications