ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ(DSC) షెడ్యూల్ విడుదలైంది. గతంలో ప్రకటించిన విధంగానే మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం(ఏప్రిల్ 20న)నాడు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6వ తేది నుంచి జులై 6 వ తేదీ వరకు సీబీటీ (కంప్యూటర్ ఆధారంగా) విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్లో అందుబాటులో ఉంటాయని స్పష్టంచేసింది.

వయో పరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వయోపరిమితి పెంపు ఈ మెగా డీఎస్సీకి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కటాఫ్ తేదీని 2024, జులై 1గా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికులతోనే 80 శాతం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2024 ఖాళీలు ఉండనున్నాయి. ఇక, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉన్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుండటంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications