నల్గొండకు కేంద్రం వరం.. త్వరలో వెయ్యి కోట్ల నిధులు వస్తాయన్న మంత్రి!
త్వరలో కేంద్రం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేకనిధులు ఇచ్చే అవకాశం ఉందని, నల్గొండ అభివృద్ధి దీనివల్ల సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచి సుమారు రూ.1,000 కోట్ల ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఈ నిధులు అందితే నల్గొండ పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్గొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం నల్గొండ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద 64 మంది లబ్ధిదారులకు మొత్తం 64 లక్షల ఏడు వేల 424 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న కోమటిరెడ్డి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, అర్హులందరికీ లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ఇటీవల 83 కోట్ల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
పట్టణ ప్రజల తాగునీటికి అదనంగా మరో 300 కోట్ల రూపాయలు మంజూరు
పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రభుత్వం అదనంగా మరో 300 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు
నగర మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నామని పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాలలోనూ ఇల్లు లేని నిరుపేదలకు 700 ఇళ్ళు
కేంద్ర నిధులు మంజూరైతే నల్గొండ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికను అమలు చేస్తామని, అత్యాధునిక నగరంగా నల్గొండ ని తీర్చిదిద్దుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని, ఈ క్రమంలోనే పట్టణ ప్రాంతాలలోనూ ఇల్లు లేని నిరుపేదలకు 700 ఇళ్లను మంజూరు చేసినట్టు వెల్లడించారు.
అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు తీసుకెళతాం
సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండింటిని రెండు కళ్ళుగా చూస్తామని, వాటిని సమానంగా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.













Click it and Unblock the Notifications