నీట్ యూజీ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు.. మే 5న పరీక్ష..
నీట్ యూజీ 2024 దరఖాస్తు గడువు పొడిగించారు. కావున అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 9,10 తేదీల్లో దరఖాస్తు చేసుకోగలరు. నీట్ యూజీ కోర్సును దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 9న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిబ్రవరి 9 నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. గత నెల16తో నీట్ యూజీ-2024 దరఖాస్తు గడువు ముగియగా, ఎన్‌టిఎ మరోసారి విద్యార్థులకు ఓ అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో నీట్ యూజీ అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 10న రాత్రి 10.50 గంటల వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అయితే ఏప్రిల్ 10వ తేది రాత్రి 11.50 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది.
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇది ఆఫ్‌లైన్ ఎగ్జామ్. (పెన్ను, పేపర్ విధానంలో ఉంటుంది.) హాల్ టికెట్ డౌన్‌లోడ్, ఇతర వివరాలు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ త్వరలోనే తన వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది. ఇక, ఈఏడాది నీట్ యూజీ పరీక్ష మే 5 వ తేది ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటలకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకోవాలనుకునేవారు 50శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సంబంధిత గ్రూపులతో 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగుల అభ్యర్థులకు మాత్రం ఈ సబ్జెక్టు్ల్లో 40 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.

ఫీజు, ఇతర వివరాలు..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.1700 చెల్లించాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులయితే రూ.1600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/థర్డ్ జండర్ అభ్యర్థులయితే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 31.12.2024 నాటికి అభ్యర్థుల వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31.12.2007కు ముందు జన్మించి ఉండాలి. ఇతర అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.












Click it and Unblock the Notifications