విరక్తితో ఉద్యోగం మానేద్దామనుకుంటే- 15 నెలల జీతంతో లేఆఫ్ ..! ఇదో అదృష్టవంతుడి కథ..!
మన దేశంలోని కంపెనీల్లో మారుతున్న పని వాతావరణం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఉద్యోగాల డిమాండ్ తో సమానంగా లేఆఫ్స్ కూడా పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి వాతావరణంలో పనిచేయ లేక ఎప్పుడు దీన్ని వదిలి వెళ్లిపోయి ప్రత్యామ్నాయ మార్గాల్లో జీవితంలో స్దిరపడాలనే ఆలోచనలు కూడా ఉద్యోగుల్లో పెరుగుతున్నాయి. అలాంటి ఓ ఉద్యోగి తన కంపెనీలో పని వాతావరణం నచ్చక వదిలేద్దామనుకునే సమయంలో ..సదరు కంపెనీయే లేఆఫ్ ఇచ్చి 15 జీతంతో ఇంటికి పంపేసింది. ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారనే చర్చ ఇప్పుడు నెట్టింట జరుగుతోంది.
అమెరికాలోని శాంటియాగోకు చెందిన వైర్ లెస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ల తయారీ సంస్థ క్వాల్ కామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 52 వేల ఉద్యోగుల్లో 7 శాతం అంటే 3600 మందిని లేఆఫ్ ఇచ్చి ఇంటికి పంపేస్తోంది. ఇందులో భాగంగా భారత్ లోని తమ వెయ్యి మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ దానికి ముందే ఆ కంపెనీలో ఐదేళ్లుగా పనిచేస్తున్న భారతీయ ఉద్యోగి (Qualcomm Employee) ఒకరు అక్కడి పని వాతావరణం నచ్చక ఉద్యోగం మానేద్దామని అనుకుంటున్నారు. అదే సమయంలో క్వాల్ కామ్ 15 నెలల జీతం పరిహారంగా ఇచ్చి లేఆఫ్స్ ప్రకటించడం, అతని హాయిగా దాన్ని తీసుకుని నిష్కృమించడం జరిగిపోయాయి. ఈ అనుభవాన్ని అతను రెడ్డిట్ లో షేర్ చేశారు. దీన్ని ఇండియా టుడే కథనంగా ప్రచురించింది.

ఇందులో ఆయన.. తనకు తాజాగా క్వాల్ కామ్ ఇచ్చిన లేఆఫ్ ను మంచి కోసం జరిగిన చెడుగా అభివర్ణించారు. ఎందుకంటే తాను అక్కడి విషపూరిత వాతావరణం నచ్చక ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం వెతుక్కోవాలని భావిస్తున్న తరుణంలో కంపెనీ ఏకంగా 15 నెలల జీతాన్ని పరిహారంగా ప్రకటించి, ఉద్యోగం మానేయగానే ఉండే ఇబ్బందులను దూరం చేసిందని తెలిపారు. అక్కడి పని వాతావరణం ఇబ్బందిగా ఉందని, వ్యక్తిగత దాడులు, సాంకేతిక సామర్ధ్యాలపై విమర్శలు, సహోద్యోగుల నుంచి లభించని మద్దతు తనను క్షోభకు గురిచేశాయని, ఇలాంటి సమయంలో కంపెనీ లేఆఫ్ ఇచ్చిందన్నారు.
దీనికి బోనస్ గా మూడు నెలల పాటు ఇచ్చే ప్రామాణిక పరిహారంతో పాటు మూడు రోజుల్లోనే పత్రాలపై సంతకం చేసినందుకు అదనంగా ఒక నెల, తన పదవీకాలానికి లింక్ అయిన మరో ఐదు నెలలు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రెండు నెలల బోనస్, రెండు నెలల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇలా అన్నీ కలిపి 15 నెలల జీతం లభించినట్లు సంతోషంగా చెప్పారు. ఇప్పుడు వెంటనే తాను మరో ఉద్యోగంలో చేరకుండా తిరిగి చదువుకుని, ఇంటర్వ్యూలకు సిద్దం కావడానికి, తన కుటుంబంతో, సన్నిహితులతో సంతోషంగా గడపాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.














Click it and Unblock the Notifications
