పెళ్లికి వారం రోజుల ముందే లేఆఫ్ బాంబ్.. హైదరాబాద్ టెకీ కన్నీటి గాథ!
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ ఎంతోమంది జీవితాల్లో ఊహించని కుదుపులను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాలికామ్(Qualcomm) చేపట్టిన లేఆఫ్స్ కారణంగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన పెళ్లికి సరిగ్గా ముందే ఉద్యోగం కోల్పోయాడు. "నా పెళ్లి జరిగే వారంలోనే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్లు చెప్పాలని కంపెనీ భావించింది" అంటూ ఆ ఉద్యోగి సోషల్ మీడియా వేదిక రెడిట్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు.
అసలేం జరిగిందంటే?
రెడిట్ వేదికగా హైదరాబాద్‌కు చెందిన క్వాలికామ్ ఉద్యోగి తన అనుభవాన్ని పోస్ట్ చేశారు. ఈ నెల చివర్లో ఆయనకు వివాహం జరగనుంది. పెళ్లి పనుల నిమిత్తం ఆయన సెలవుపై ఉన్న సమయంలోనే కంపెనీలో ఉద్యోగాల కోత మొదలైంది. పెళ్లి హడావిడి, ఒత్తిడి మధ్య తన ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని ఆందోళన ఆయనను వెంటాడింది. దీంతో అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఉద్యోగి.. తన మేనేజర్ కు మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో మెసేజ్ చేయడంతో పాటు ఫోన్ కూడా చేశారు. మొదట స్పందించని మేనేజర్.. ఆ తర్వాత ఫోన్ చేసినప్పుడు నేరుగా అడగడంతో అసలు విషయం చెప్పారు. లేఆఫ్స్ జాబితాలో ఆయన పేరు కూడా ఉందని.. పెళ్లి జరిగే వారంలో ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయాలని కంపెనీ అనుకుందని మేనేజర్ వివరించారు. "నేను కూడా ఈ కోతల్లో ప్రభావితమయ్యానని మేనేజర్ చెప్పారు. అందుకు విచారం వ్యక్తం చేశారు" అని ఆ ఉద్యోగి రాసుకొచ్చారు.

ఉద్యోగం పోయినా.. ఇక ఆందోళన తీరింది!
జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిపేడుకకు ముందు ఉద్యోగం పోయినప్పటికీ.. ఆ టెకీ సానుకూలంగా స్పందించడం విశేషం. "కనీసం ఇప్పుడు ఆ అనిశ్చితి తొలగిపోయింది. నా ఉద్యోగం ఉంటుందో పోతుందో అని ప్రతిక్షణం భయపడాల్సిన అవసరం లేకుండా పోయింది." అని ఆయన పేర్కొన్నారు. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ అండగా నిలిచారు. ముందుగా పెళ్లి వేడుకను ఆనందంగా జరుపుకోవాలని.. అయితే ఉద్యోగం పోయిన విషయాన్ని కాబోయే జీవిత భాగస్వామికి ముందే చెప్పడం మంచిదని పలువురు సలహా ఇచ్చారు.
క్వాలికామ్‌లో భారీ లేఆఫ్స్.. ఇండియాలో 1,000 మందిపై ప్రభావం
క్వాలికామ్ తన ప్రపంచవ్యాప్త 52,000 మంది ఉద్యోగులలో దాదాపు 7 శాతం అంటే దాదాపు 3,600 మందిని తొలగిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఇండియాలోని బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 1,000 మందిపై వేటు పడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో మరో విడత లేఆఫ్స్ ఉండొచ్చని తెలుస్తోంది. మొబైల్ హ్యాండ్‌సెట్ల విభాగంలో ఆదాయం తగ్గడం, ఏఐ డేటా సెంటర్లపై కంపెనీ దృష్టి సారించడమే ఈ లేఆఫ్స్‌కు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 350 కంపెనీలలో 1.42 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు.














Click it and Unblock the Notifications
