Satya Nadella:హైదరాబాదులో సత్యనాదెళ్ల..తాను చదివిన స్కూల్లో..ఆ నాటి జ్ఞాపకాలు..!!
ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీల అధినేతలు ఒక్కసారిగా హైదరాబాదులో మెరిశారు. ఎలాంటి హడావుడి ఆర్భాటం లేకుండా అసలు ఆ స్థాయి వ్యక్తులు వచ్చారా అనేలా తమ కార్యక్రమాన్ని అలా వచ్చి అలా పూర్తి చేసుకున్నారు. అసలు ఈ టెక్ దిగ్గజాలు హైదరాబాదుకు వస్తున్నారన్న సమాచారం మీడియాకు సైతం లేదు. ఇంతకీ ఆ టెక్ దిగ్గజాలు ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్. వీరు ఇంత సడెన్‌గా హైదరాబాదులో ఎందుకు ల్యాండ్ అయ్యారా అనేది తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ అధినేత శంతను నారాయణ్‌లు ఎంత బిజీగా ఉంటారో మనకు తెలిసిందే. కానీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారు ఈ స్థాయిలో ఉండేందుకు కారణమైన తమ పాఠశాలను మాత్రం మర్చిపోలేదు. వారి బిజీ లైఫ్ నుంచి కొంత సమయం తాము చదివిని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో గడిపేందుకు ఆనాటి జ్ఞాపకాలు నెమరేసుకునేందుకు అమెరికా నుంచి హైదరాబాదులో వాలిపోయారు. ఔను సత్యనాదెళ్ల, శంతను నారాయణ్‌తో పాటు ప్రపంచంలో పలు టెక్ దిగ్గజ సంస్థలకు చెందిన సీఈఓలు, ఇతర ప్రముఖులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వి విద్యార్థుల సమ్మేళనంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్కూలు తమకు జీవితంలో ఎలా ఉండాలో అన్న పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏటా స్కూల్ రీయూనియన్‌ను డిసెంబర్ 25,26వ తేదీల్లో నిర్వహిస్తుంది. ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులందరూ ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు చేరుకుని తమ మిత్రులను క్లాస్‌మేట్స్‌ను టీచర్స్‌ను కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. ఒకప్పుడు నిక్కర్లలో తాము చేసిన అల్లర్లు, టీచర్ల నుంచి చీవాట్లు ఇలా ఒక్కొక్కటిగా నెమరేసుకుంటారు. సత్యనాదెళ్ల కూడా తన పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్కూలు గతేడాది శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. ఇది 101వ సంవత్సరం.
HPS నాకు చాలా నేర్పింది
సత్యనాదెళ్ల 45 ఏళ్ల క్రితం హైదరాబాద్ పబ్లిక్ స్కూలు నుంచి పాస్‌ఔట్ అయ్యారు. ఆయన బోర్డింగ్‌లో ఉండేవారని చెప్పుకొచ్చారు. బోర్డింగ్ జీవితం తనకు ఎన్నో పాఠాలను నేర్పిందని చెప్పుకొచ్చిన ఈ టెక్ దిగ్గజం ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తనకు పాఠాలు నేర్పిన టీచర్లు, స్నేహితులని గుర్తుచేసుకున్నారు. ఈ 40 ఏళ్లలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని చెప్పిన సత్యనాదెళ్ల...ప్రతి మూల ఇప్పటికీ తనకు గుర్తు ఉందని చెప్పారు. తన స్కూల్ డేస్ తనలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపాయని చెప్పుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడిన ఈ టెక్ దిగ్గజం... ఇది కచ్చితంగా మానిషి మేధస్సుకు సవాలుగానే మారుతుందని చెప్పారు. అయితే స్కూల్లో నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు.
నాలో నాయకత్వ లక్షణాలకు పునాది వేసింది HPS
ఇక మరో టెక్ దిగ్గజం అడోబ్ సంస్థ అధినేత శంతను నారాయణ్ మాట్లాడారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు వాతావరణం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.తను నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంలో ఈ స్కూలు పాత్ర కీలకమని చెప్పారు.అంతేకాదు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివే విద్యార్థులు ఆల్‌రౌండర్లుగా స్థిరపడుతారని అన్నారు. కొంతమంది స్నేహితులు మాత్రమే హాజరైన ఈ సమావేశం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. అనంతరం ప్రతి ఒక్కరూ ఈ టెక్ దిగ్గజాలతో ఫోటోలు తీసుకున్నారు. తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.












Click it and Unblock the Notifications