Roshini Scheme:వలస విద్యార్థుల చదువుకు వరంగా మారిన రోషిణి స్కీమ్..!
కేరళ... ప్రకృతి అందాలకు నిలయం. ఈ రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. నిజంగా స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ రాష్ట్రంలో నిత్యం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఇక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఇందుకు ముఖ్య కారణం చదువు. కేరళలో అక్షరాస్యత శాతం(Literace rate)94శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి 100 మందిలో 94 మంది చదువుకున్నవారే అని చెప్పొచ్చు. అందుకే కేరళ అభివృద్ధి వైపు దూసుకెళుతోంది. ఇక సొంత రాష్ట్రంవారినే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కేరళలో సెటిల్ అయిన వారి పిల్లలు కూడా విద్యారంగంలో దూసుకెళుతున్నారుంటే అక్కడి ప్రభుత్వం తీసుకున్న చొరవ, ప్రోత్సాహం వల్లే అని చెప్పాలి.ఇప్పుడు మీరు చదవబోయే స్టోరీ కూడా అలాంటిదే.
ఎక్కడో మహారాష్ట్రలోని ఓ మూరుమూల గ్రామం నుంచి 20 ఏళ్ల క్రితం ప్రదీప్ మొహితే అనే వ్యక్తి కేరళకు వలస వచ్చాడు. ఎర్నాకులం జిల్లాలోనే ఉంటూ రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం గడిపాడు. ఇక తన సొంత రాష్ట్రానికే చెందిన మరో మహిళలను వివాహం చేసుకుని ఆమెను కూడా ఎర్నాకులంకు తీసుకొచ్చాడు. వారికి శివరాజ్ అనే మగబిడ్డ పుట్టాడు. అయితే తను ఎలాగూ చదవుకోలేదు కాబట్టి తన బిడ్డ కూడా తనలా కూలీ కాకూడదని భావించి బాగా చదివించి గొప్పవాడిని చేయాలని కలగన్నాడు. అయితే ఇందుకు తన ఆర్థిక స్థోమత సరిపోలేదు. మరోవైపు కేరళలో మలయాలం, హిందీ, ఇంగ్లీషు ఎక్కువగా ఉంటుంది. మరి తన బిడ్డకు ఆ చదువు అబ్బుతుందో లేదో అని కంగారుపడ్డాడు. కట్ చేస్తే గత వారం కేరళలో విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రదీప్ కొడుకు శివరాజ్ A+ గ్రేడ్‌తో పాసై టాపర్‌గా నిలిచాడు. ప్రదీప్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇదంతా ఎలా సాధ్యపడింది..?

కలలను సాధ్యం చేసిన రోషిణి పథకం
వెన్నికులంలోని సెయింట్ జార్జ్ హైస్కూల్‌లో చదివిన శివరాజ్ గతవారం కేరళ బోర్డు విడుదల చేసిన 10వ తరగతిలో A+ గ్రేడ్ సాధించి టాపర్‌గా నిలిచాడు. ఇలా ఒక్క శివరాజే కాదు చాలామంది వలస కుటుంబాలకు చెందిన పిల్లలు చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాసయ్యారు. ఇదంతా కేరళ ప్రభుత్వం వలస కుటుంబాల పిల్లలకు మంచి విద్యను అందించాలనే భావనతో రోషిణి పేరుతో పథకం ప్రారంభించింది. వీరంతా ఈ పథకం ద్వారా చదువుకుని మంచి మార్కులతో పాసయ్యారు. రోషిణి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే స్థానిక భాషతో పాటు హిందీ ఇంగ్లీషు భాషలు నేర్చుకునేందుకు పలు కారణాలతో ఇబ్బందులు పడుతున్నారో అట్టివారిని గుర్తించి వారికి ఈ పథకం కింద విద్యను అందించే కార్యక్రమం చేసింది కేరళ ప్రభుత్వం.

విద్యార్థులు ఏం చెబుతున్నారు
రోషిణి పథకం కింద అందించే విద్య పూర్తిగా ఉచితం. ఎలాంటి డబ్బులు లేదా ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. ఇంతటి నాణ్యమైన విద్య బయట రాష్ట్రాల్లో పొందాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని అలాంటిది తమ పిల్లలు ఉచితంగా చదువుకుని మంచి మార్కులతో పాసయ్యారంటే అందుకు కారణం కేరళ ప్రభుత్వమే అని గర్వంగా తల్లిదండ్రులు చెబుతున్నారు. A+ గ్రేడ్‌తో పాసైన మరో విద్యార్థి సుశ్మిత మాట్లాడుతూ తన కుటుంబం ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లా నుంచి కేరళకు వలస వచ్చిందని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని తన గ్రామంలో మహా అయితే 10వ తరగతి వరకు చదువుకుంటారని ఆ తర్వాత చదువకు స్వస్తి చెబుతారని పేర్కొంది. కానీ కేరళలో అలాంటి పరిస్థితి కనిపించదని 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులు ప్రతి ఒక్కరూ చదువుతారని చెబుతోంది. అంతా పై చదువులు చదువుతుంటే 10వ తరగతి మాత్రమే చదివి ఇంటిపట్టున ఉండాలంటే ఉండలేమని చెప్పుకొచ్చింది. ఇక్కడి విద్యా వాతావరణం ప్రతి అమ్మాయికి ఏదో తెలియని ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొంది.
కేరళలో అక్షరాస్యత శాతం క్రమంగా తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రోషిణి పథకం ద్వారా వలస కుటుంబాల పిల్లలకు విద్యను అందిస్తుండటంతో అక్కడి స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ శాతం మళ్లీ పెరిగింది.ఎర్నాకులంలోని స్కూళ్లలో ఎక్కువ శాతం వలస కుటుంబాల పిల్లలే ఉంటారు. వారికి రోషిణి పథకం ఒక వరంలా మారిందని చెప్పొచ్చు.
రోషిణి పథకం ఏంటి..?
2017లో ఎర్నాకులం జిల్లా పాలనావర్గంతో విద్యాశాఖ జతకట్టి రోషిణి పథకాన్ని తీసుకొచ్చింది.స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించి ఎన్‌రోల్‌మెంట్ పెంచడమే లక్ష్యంగా పనిచేశాయి.వలస కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యతతో కూడిన విద్యను అందించడం అలాగే వారి చదువుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా తీర్చిదిద్దడం లక్ష్యంగా రోషిణి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎర్నాకులం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా నాలుగు పాఠశాలల్లో రోషిణి పథకాన్ని ప్రవేశ పెట్టి మంచి ఫలితాలు రావడంతో ఇప్పుడు 40 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలకు విస్తరించడం జరిగింది.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద 2400 మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారు.రోషిణి పథకం ప్రవేశపెట్టక ముందు చాలా మంది విద్యార్థులు చదువు మానేసేవారు. ఇందుకు కారణం మళయాలం భాషలో విద్య ఉన్నందున వారు చాలా ఇబ్బంది పడేవారు.

ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఏం చెబుతున్నారు..?
భాషాపరమైన సమస్యను పరిష్కరించేందుకే రోషిణి పథకం తీసుకురావడం జరిగిందని ఆ ప్రాజెక్ కోఆర్డినేటర్ ప్రకాష్ చెప్పారు. ఈ పథకం ద్వారా మళయాలం, ఇంగ్లీష్, హిందీ మీడియంలో విద్యను అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.అంతేకాదు ఉదయం వేళల్లో టిఫిన్ కూడా స్కూళ్లలోనే విద్యార్థులకు పెడుతున్నట్లు వివరించారు. ముందుగా ఒకటవ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఈ పథకం కింద విద్యను అందించామని ఇప్పుడు అది 10వ తరగతికి విస్తరించినట్లు ప్రకాష్ వెల్లడించారు. గత మూడేళ్లుగా రోషిణి పథకం ద్వారా విద్యను పొందిన విద్యార్థులు తమ 10వ తరగతి ఫలితాల్లో చక్కటి ప్రదర్శన కనబర్చాని ప్రకాష్ ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చాలా కుటుంబాలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్లగా కొన్ని కుటుంబాలు మాత్రం తమ పిల్లల చదువుకోసం ఇక్కడే ఉండిపోయారని గుర్తు చేశారు.
మొత్తానికి కేరళ విద్యాశాఖ తీసుకొచ్చిన రోషణి పథకం తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలైతే ఇక్కడ కూడా అక్షరాస్యత పెరుగుతుందనే అభిప్రాయం విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. వారి పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేసి తల్లిదండ్రులతో పాటు పనులకు వెళుతున్నారు. వారు కూడా స్కూలుకు వెళ్లి చదువుకోవాలంటే రోషిణి లాంటి మంచి పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications